భూమి గుండ్రంగా ఉంటుంది. రాజకీయం కూడా అంతే. తాము తీసుకున్న నిర్ణయాలు తమకే రివర్స్ అవుతాయి. కాకపోతే కొంత టైం పడుతుంది.ఆ టైం ఇప్పుడు టీఆర్ఎస్కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై ఓ రకమైన నిర్బంధం అమలు చేశారు. అందులో భాగంగా ధర్నాలు చేయడానికి ప్రసిద్ధి పొందిన ఇందిరాపార్క్ వద్దకు కూడా వెళ్లకుండా నిషేధించారు. అక్కడ ధర్నాలు చేయవద్దని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ అంటూ.. ఊరవతల ఎక్కడో స్థలం ఇస్తామని చెప్పారు. చివరికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని.. ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై మండిపడ్డాయి.
కాని వాటిని టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్కు ధర్నా చేయడానికి అదే ధర్నా చౌక్ అవసరం వచ్చింది. కామెడీ ఏమిటంటే ఇంకా టీఆర్ఎస్ అధికారంలోనే ఉంది. అధికారంలో ఉండి కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేయడానికి ఇందిరాపార్క్ వద్ద ఏర్పాట్లు చేసుకుంటున్నరు. పన్నెండో తేదీన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు చేయనుంది. హైదరాబాద్‌కు సంబధించి ఎమెల్యేలు, ఎమ్మెల్సీలందరూ ఇందిపార్క్ వద్ద ధర్నా చేయనున్నారు.
ఈ ఏర్పాట్లను తలసాని చూసుకుంటున్నారు. అధికారంలో ఉండి మరీ ఇందిరాపార్క్‌లో ధర్నాకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ .. గతంలో ఎందుకు ఆంక్షలు విధించిందో గుర్తు చేసుకోవాలని కొంత మంది సూచిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఇలాంటి పట్టింపులేమీ ఉండవు. అధికారంలో ఉన్నా లే్కపోయినా.. వారికి అనుకూలమైనదే రాజకీయ పార్టీలు చేస్తాయి. విమర్శలు వస్తాయని.. సెటైర్లు వేస్తారని పట్టించుకునే పరిస్థితి ఉండదు.