అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తూండటంతో .. మూడు రాజధానులకు కూడా అంత కంటే ఎక్కువ మద్దతు ఉందని చెప్పేందుకు వైసీపీ పోటీ పాదయాత్రకు ప్లాన్ చేస్తోంది. అయితే స్వచ్చంద సంస్థలు పాదయాత్ర నిర్వహిస్తామని ముందుకు వచ్చాయని దానికి తాము మద్దతిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ఇతర వైసీపీ నేతలు ప్రస్తుతం ఈ పని మీదనే ఉన్నారు. స్వచ్చంద సంస్థలను బయటకు తీసుకు వచ్చి.. వారికి కావాల్సిన ఆర్థిక సాయం చేసి.. ఇతర అన్ని వ్యవహారాలను వైసీపీ చూసుకునేలా మాట్లాడుతున్నారు.
నిజానికి అమరావతి రైతులు .. తాము భూములు ఇచ్చామని.. అన్యాయం చేయకూడదని.. అందుకే అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు ఎవరూ భూములు ఇవ్వలేదు. పైగా అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు… ఆ తర్వాత కూడా ఉత్తరాంధ్రలో రాజధాని కావాలని ఎవరూ అడగలేదు. ఇప్పటికీ అక్కడ చాలా మంది ప్రజా ప్రతినిధులు అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుతున్నారు.
ఒక్క వైసీపీ నేతలు మాత్రం ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వంటి వాళ్లు అమరావతి రైతులు ఉత్తారంధ్రలోనూ పాదయాత్ర చేయాలని పిలుపునిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా … పోటీ పాదయాత్రలకు వ్యూహం సిద్ధం చేసింది.