హుజురాబాద్ విజయం వచ్చిన టెంపోను ముందుకు తీసుకెళ్లాలంటే మరో ఉపఎన్నిక కావాలని బీజేపీ భావిస్తోంది. అది ఈటల విజయంగా ఎక్కువ మంది డిసైడ్ చేస్తున్నారు. అయితే బీజేపీ విజయమని చెప్పేందుకు మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేను రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి రెడీగా ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీకే ఆదరణ పెరుగుతోందని గతంలో ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలోనే ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆగిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదు. పైగా, తాను భవిష్యత్తులో బీజేపీలో చేరుతానని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నికలు వచ్చేలా చేస్తే గెలుపు ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఆయనపై ఇప్పటికే అనర్హతా వేటు పడాల్సింది. కానీ అప్పీళ్ల వల్ల ఆలస్యం వుతోంది. కోర్టు తీర్పు రమేశ్‌కు వ్యతిరేకంగా రావడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నారు. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం రెండో స్థానంలో ఉన్న వారితో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు.ఇప్పుడు కూడా అలా చేస్తే ఉపఎన్నిక రాదు. మళ్లీ ఎన్నిక పెట్టాలని హైకోర్టు ఆదేశిస్తే ఉపఎన్నిక వస్తుంది. ఎలాగైనా ఓ చోట ఉపఎన్నిక కావాలని బీజేపీ కోరుకుంటోంది.