అమెరికాలో ఉండి దేశ న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ అడిగినట్లుగా హైకోర్టు పది రోజులు గడువు ఇచ్చినప్పటికీ పట్టుకోలేకపోయారు. రెండో తేదీన జరిగిన విచారణలో పది రోజుల్లోగా అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పది రోజుల గడువు ముగుస్తున్న సమయంలో న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మరో ఐదు మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది కానీ.. పంచ్ ప్రభాకర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. ఆయనను అరెస్ట్ చేయడానికి బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
పంచ్ ప్రభాకర్‌తో పాటు మరో వ్యక్తి కోసం ఈ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేశారు. నిజానికి ఈ బ్లూకార్నర్ నోటీసుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. గతంలో దేశం విడిచి వెళ్లిపోయి… ఎక్కడో సొంత దేశం సైతం పెట్టేసుకున్న నిత్యానందను పట్టుకోవడానికి కూడా ఈ బ్లూకార్నర్ నోటీసులే ఇచ్చారు. ఆయన ఇంంత వరకూ అడ్రస్ లేరు . నిజానికి ఈ బ్లూకార్నర్ నోటీసులు కేవలం ఆ వ్యక్తి గురించిన సమాచారం సేకరించడానికే కానీ పట్టుకుని తమకు అప్పగించేలా ఆయా దేశాలను చేసే విజ్ఞప్తి కాదు.
సీబీఐ ఎందుకు పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయడానికి ముందూ వెనకాడుతుందో ఎవరికీ తెలియడం లేదు.. కానీ హైకోర్టుకు చెప్పినట్లుగా అరెస్ట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన తెలుగు మీడియా చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ సీబీఐ తనను అరెస్ట్ చేయడం అసాధ్యమని.. అంత సీన్ లేదని ఓ వైపు ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు సీబీఐ కూడా తేలిగ్గా తీసకుంటోంది.