తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడటానికి అవసరమైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అవసరం అయితే రోజూ ప్రెస్మీట్ పెడతానని సోమవారం చెప్పిన ఆయన మూడు రోజులు విరామం ఇచ్చారు. ఈ మధ్యలో అంత ఘాటుగా ఎవరూ స్పందించలేదు. ఈ రోజు షెకావత్ కేసీఆర్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టడానికి అవసరం అయిన సరంజామా ఇచ్చారు. కేసీఆర్ రెండు ప్రెస్మీట్లలో జల వివాదాలను కేంద్రం పరిష్కరించలేదని.. అంతా డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు షెకావత్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. డ్రామా మాది కాదు..మీదేనని మండి పడ్డారు.
కొత్త ట్రైబ్యునల్ కావాలని తెలంగాణనే సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగినప్పుడు రెండు రోజుల్లో పిటిషన్ ఉపసంహరించకుంటానని కేసీఆర్ చెప్పారని.. కానీ ఏడు నెలల తర్వాత ఉపసంహరించుకున్నారన్నారు. పిటిషన్ కోర్టులో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ ఇలా మాట్లాడకూడదని స్పష్టం చేశారు.
షెకావత్ ఏం చెప్పినా కౌంటర్ ఇవ్వడానికి కేసీఆర్ వద్ద ఆన్సర్ రెడీగా ఉంటుంది. దీంతో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై మరోసారి విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి విమర్శలకు కేంద్ర మంత్రులు స్పందించరు. కానీ అనూహ్యంగా షెకావత్ మీడియాతో మాట్లాడి కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు.