ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక.. ఉద్యోగుల్లో తమపై తిరుగుబాటు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో కలిసి ఉద్యోగ సంఘ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సచివాలయంలో విస్తృత చర్చ జరుగుతోంది. అంతా ప్రభుత్వ ముఖ్యుల డైరక్షన్లోనే పీఆర్సీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని.. అవమానిస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారని .. ఇలా చేయాలని చెప్పింది ప్రభుత్వపెద్దలేనన్న అనుమానం ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఉంది. ఎందుకంటే ఉద్యోగ సంఘ నేతలు పీఆర్సీని తక్షణం ప్రకటించాలని అడగడం లేదు. కేవలం పీఆర్సీ నివేదిక మాత్రమే అడుగుతున్నారు. అది ఎప్పుడో కేంద్రానికి చేరింది.
ఆ నివేదిక కాపీ తీసి ఇవ్వడానికి గంట కూడా పట్టదు. కానీ నెలల తరబడి వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే. అడుగుతోంది పీఆర్సీ నివేదికే కానీ పీఆర్సీ కాదు. ఆ నివేదిక ఇస్తే తాము చేయాలనుకున్నది తాము చేస్తామని అంటున్నారు. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు కానీ నివేదిక ఇవ్వడానికే ప్రభుత్వం ఇలా చేస్తూంటే ఇక పీఆర్సీ ఏం ప్రకటిస్తుందన్న చర్చ ఉద్యోగుల్లో ఉంది. అంతే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల దగ్గర్నుంచి అన్నీ సమస్యలు ఉన్నాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాదు… చట్టం ప్రకారం రావాల్సిన ఏ ప్రయోజనం అందడం లేదు. చివరికి ఉద్యోగుల జీతాల నుంచి కత్తిరించుకున్న జీపీఎఫ్, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదట. ఇవన్నీ ప్రభుత్వాన్ని నిలదీసి ఇప్పించాలని ఉద్యోగులు అడుగుతున్నారు. కానీ ఉద్యోగ నేతలు పీఆర్సీ నివేదిక పేరుతో డ్రామాలాడుతున్నారని.. అసలు సమస్యలు పైకి రాకుండా చేస్తున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగస్వాములై ఉద్యోగుల్ని వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.