ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా కాలు నొప్పి వచ్చింది. కుడి కాలుకు గాయం కారణంగా ఈ నొప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంటి దగ్గర చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో ఆయన తాడేపల్లిలోనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో ఆయన రెండు గంటల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనీయలేదు.
ఆస్పత్రికి జగన్ వెళ్లే సరికి .. ఎవరినో పరామర్శించడానికి వెళ్లారని అనుకున్నారు. కానీ ఆయనే కాలికి వైద్యం కోసం వచ్చినట్లుగా ఆలస్యంగా బయటకు తెలిసింది. జగన్కు గాయం ఎలా అయింది.. ఎలాంటి ట్రీట్ మెంట్ చేశారన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ట్రీట్ మెంట్ తర్వాత క్యాంపాఫీస్కు చేరుకుని యథావిధిగా కార్యక్రమాలు కొనసాగించారు.
గతంలోనూ ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా.. జిమ్లో కాలు బెణకడంతో ఆయన సమావేశానికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు కూడా అమిత్ షా నేతృత్వంలో సదరన్ కౌన్సిల్ భేటీ జరగనున్న రెండు రోజుల ముందేకాలుకు గాయం కావడం యాధృచ్చికం.