తెలుగు360 రేటింగ్: 2/5
ప్రతీ కథకూఓ జోనర్ అంటూ ఉంటుంది. కానీ ఈమధ్య మన దర్శకులకు తెలివి మీరిపోయో, చాలా విషయాలు ఒకే కథలో ఇమిడ్చేయాలన్న ఉత్సాహంతోనో.. జోనర్లన్నీ కలగాపులగం చేసేస్తున్నారు. పుష్షక విమానం సినిమా చూసినా ఇదే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇది భార్యా భర్తల కథనా? కామెడీ సినిమానా? థ్రిల్లరా? ఏదీ అర్థంకాదు. ఎటో మొదలై.. ఎటో వెళ్తుంది. మరి ఈ సినిమా ఎలా మొదలైంది? చివరికి ఎలా ముగిసింది? ఆ మొదలూ, ముగింపు మధ్య కథంటూ ఉందా? ఉంటే అది ఎలా ఉంది?
సుందర్ (ఆనంద్ దేవరకొండ) గవర్నమెంట్ స్కూల్ లో టీచర్. చాలానెమ్మదస్తుడు. తనకు కాబోయే పెళ్లాం గురించీ, వైవాహిక జీవితం గురించీ కొన్ని కలలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు కుదిర్చిన అమ్మాయినే మీనాక్షి (గీత్ సైనీ)ని పెళ్లి చేసుకుంటాడు. హైదరాబాద్ లో కాపురానికి తీసుకొస్తే.. పెళ్లయిన పది రోజులకే… మీనాక్షి ఎవరితోనో వెళ్లిపోతుంది. దాన్ని కవర్ చేయడానికి నానా పాట్లూ పడుతుంటాడు సుందర్. తన పెళ్లాం లేకపోయినా, ఇంట్లోనే ఉందని అందరితోనూ నమ్మిస్తాడు. ఓ అద్దె భార్యని తెచ్చుకుని తన తోటి ఉద్యోగులకు `నా పెళ్లమే` అని పరిచయం చేస్తాడు. ఈలోగా.. మీనాక్షి ఎక్కడుందో అన్వేషిస్తుంటాడు. అయితే కొన్ని రోజులకు మీనాక్షి శవమై కనిపిస్తుంది. మీనాక్షిని చంపిన కేసు.. అటు తిరిగి ఇటు తిరిగి సుందర్ పై పడుతుంది. మరి ఇందులోంచి సుందర్ ఎలా బయటకు వచ్చాడు? అసలు మీనాక్షిని చంపింది ఎవరు? అనేదే మిగిలిన కథ.
పుష్షక విమానం. ఎంత మంచి టైటిలో కదా? అసలు ఈ కథకీ టైటిల్ కీ సంబంధం ఏమిటో చెబితే.. కోటి రూపాయలు ఇస్తామన్న ఆన్సర్ దొరకదు. ఈ సినిమాలో `పుష్షక్` అనే ఓ ట్రావెల్ ఏజెన్సీ ఉంటుంది. అది ఉంది కదా, అందుకే ఈ పేరు పెట్టేశాం అని.. దర్శకుడు అంటే, దానికంటే పిచ్చిదనం, వెర్రిదనం ఇంకోటి ఉండదు.
అసలు పెళ్లంటే ఏమిటి? అని అడుగుతుంది హీరోయిన్.
పెళ్లంటే.. అంటూ… హీరో దిక్కులు చూస్తుంటాడు. అక్కడ `పుష్షక విమానం` టైటిల్ కార్డ్ పడుతుంది. అప్పుడే.. `ఓహో.. ఇది పెళ్లికి సంబంధించిన కథా` అనే భ్రమలో పడతాడు ప్రేక్షకుడు.ఇలాంటి భ్రమలు ఈ సినమాలో చాలా ఉన్నాయి. అసలు ఓ జోనర్ అంటూ పట్టుకోకపోవడం, ఓ జోనర్నంటూ నమ్మక పోవడం.. ఈ సినిమాలోని ప్రధాన లోపం. పెళ్లాం లేకపోతే, అద్దె పెళ్లాన్ని తెచ్చుకుని, ఆ కన్ఫ్యూజన్లోంచి కామెడీ పుట్టించడం జంథ్యాల దగ్గర్నుంచి కృష్ణారెడ్డి సినిమాల వరకూ చూస్తూనే ఉన్నాం. ఆ పాత చింతకాయ పచ్చడి సీన్లకే సగం సినిమా ధారబోయడం దర్శకుడి తాలుకూ సృజనాత్మక శూన్యతకు అద్దం పడుతుంది. పెళ్లాం ఎవరితోనో వెళ్లిపోతే.. దాన్ని కవర్ చేయడానికి ఆ భర్త అన్ని పాట్లు ఎందుకు పడతాడో అర్థం కాదు. `ఐ సెన్స్ ఇట్` అంటూ ఓ పాత్రకు ఊతపదం ఒకటి అంటించాడు దర్శకుడు. ప్రేక్షకుడూ అదే బాపతి అని, సినిమాలోని నాలుగైదు సీన్లు చూస్తే, ఆ జాతకం మొత్తం అర్థమైపోతుందన్న విషయాన్ని దర్శకుడు సెన్స్ చేయలేకపోయాడు. అద్దె పెళ్లాంతో పుట్టిన కామెడీనే ఎంతో కొంత బెస్ట్. హెడ్మాస్టారుగా నరేష్ ఒలకబోసే లేనిపోని పెద్దరికం కాస్త రిలాక్సేషన్. అంతకు మించి.. తొలి సగంలో ఏమీ ఉండదు. అయితే ఈ కథలో ఓ మర్డర్ మిస్టరీ పెట్టి, ఇంట్రవెల్ కార్డు దగ్గర సెకండాఫ్ పై కాస్త నమ్మకం కలిగించాడు దర్శకుడు.
మర్డర్ కేసు ని సరిగ్గా డీల్ చేసి, అందులో ప్రేక్షకుడి ఊహకు అందని ట్విస్టు జోడిస్తే…నిజంగానే పుష్షక విమానం కాస్త గాలిలో చక్కర్లు కొట్టేది. కానీ.. టేకాఫ్ దగ్గరే ఈ కథ ఆగిపోయి, అక్కడక్కడే దారి తోచక తిరుగుతుంటుంది. సునీల్ ని రంగంలోకి దించి – ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయాలని చూసిన దర్శకుడు.. దాన్ని కూడా మధ్యలోనే వదిలేశాడు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది ఈ సినిమాకి చాలా కీలకం. కానీ.. దాన్ని పేలవంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. పోలీస్స్టేషన్ లో సదరు అద్దె పెళ్లాం.. సునీల్ కి ఇచ్చిన రివర్స్ డోసు తప్ప.. సెకండాఫ్ లో చూడాల్సినవి, మెచ్చుకోదగినవీ ఏమీ కనిపించవు. అప్పటి వరకూ అమాయకంగా కనిపించే లెక్కల మాస్టారు సుందరం.. అప్పటికప్పుడు పెద్ద పెద్ద ఈక్వేషన్ల లాంటి లాజిక్కులు వేసేసుకుని, హంతకుడ్ని పట్టేసుకోవడం ఏదైతే ఉందో.. అది.. మరింత పేలవంగా అనిపిస్తుంది. సదరు సన్నివేశంలో.. లెక్కల మాస్టారు తెలివితేటల్ని చూపించి, ఆ రకంగా ఈ కేసుని క్లోజ్ చేసి ఉంటే, క్లైమాక్స్ కాస్తో కూస్తో పండేదేమో..?
ఆనంద్ దేవరకొండ మిగిలిన యంగ్ హీరోలకంటే కాస్త డిఫరెంట్ గా కనిపించాలన్న ప్రయత్నమైతే చేస్తున్నాడు. తనకూ తన బలాలకు తగిన పాత్రలే దక్కుతున్నాయి.మిడిల్ క్లాస్ ఉద్యోగిగా, భార్య కోసం వెదికే భర్తగా తన పాత్రకు బాగానే న్యాయం చేశాడు. గీత్ సైనీ.. ఆనంద్ పక్కన అస్సలు సూటవ్వలేదు. తనని హీరోయిన్ అని కూడా అనకూడదేమో..? తన కంటే అద్దె పెళ్లాంగా కనిపించిన శాన్వి మేఘనకే ఎక్కువ సీన్లు పడ్డాయి. హర్షవర్థన్ కి ఇది కాస్త కొత్త తరహా పాత్రే. కాకపోతే… ఆ పాత్రలోనే తాను సూటవలేదు అనిపిస్తుంది. నరేష్ ఓకే అనిపిస్తాడు. సునీల్ పాత్రని కాస్త గంభీరంగా ప్రజెంట్ చేసినా, దాన్ని దర్శకుడు సరిగా వాడుకోలదు.
కొన్ని పాత్రల కాస్టింగ్ మరీ దారుణంగా ఉంది. బహుశా బడ్జెట్ ఇష్యూస్ అయి ఉంటాయి. కొన్ని సీన్లు కూడా పైపైనే తేల్చేశాడు. లైటింగ్, కెమెరాలకు కావల్సినంత బడ్జెట్ ఇచ్చి ఉండరు. నిర్మాణ విలువలు పెద్దగా లేని సినిమా ఇది. వీలైనంత తక్కువలో సినిమాని చుట్టేయాలని అనుకున్నారేమో..? పెళ్లి పాట బాగుంది. మరో పాటలో.. కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో పాటలకు స్కోప్ లేదు. తొలి సగంలో అక్కడక్కడ కామెడీ బిట్లు తప్ప… ఎటు చూసినా పుష్షక విమానం.. నిదానంగా, నీరసంగా, ఓ పాసింజరు రైలు బండిని తలపిస్తుంది.
ఫినిషింగ్ టచ్: పాసింజర్లు లేరు
తెలుగు360 రేటింగ్: 2/5