వరి పండించిన రైతులు అమ్ముకోలేక వేదనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రాణాలు ధాన్యం కళ్లాల్లోనే పోతున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీ నేతలు ధర్నాలు చేశారు. వారికి పోటీగా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కూడా కేంద్రం వడ్లు కొనడం లేదని ధర్నాలు చేశారు. అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పోటాపోటీగా ధర్నాలు చేసేశారు. అంటే ఓ రకంగా ఇద్దరూ తమది కాదు బాధ్యత.. ఎదుటి వాడిది అని చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు రైతుకు దిక్కెవరు ?
రైతులను గందరగోళ పరుస్తూ టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా రాజకీయ గేమ్ ఆడుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అటు కేంద్రం తెలంగాణ నుంచి వడ్లను కొనడానికి సిద్ధంగా లేదు. గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలిచి ఇక కొనబోమని తెలంగాణ సీఎం చెప్పారు. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో పంట మొత్తం చివరి గింజ వరకూ రాష్ట్రమే కొంటుందని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రానికేం సంబంధం లేదన్నారు. ఇప్పుడు అదే మాటల్ని పట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. కొనేది రాష్ట్రమే అయినా అసలు సేకరించాల్సింది కేంద్రమని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ వాదిస్తోంది. దీంతో సమస్య జఠిలమయింది.
ఓ వైపు ఏపీలో ఇలాంటి సమస్య రాలేదు. అక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెబుతోంది. రైతు భరోసా కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఇంకా మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా చేస్తామని చెబుతోంది. అక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందో అక్కడి రాజకీయ పార్టీలు ప్రజల్ని ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వడంలేదు. మొత్తంగా చూస్తే అధికారంలో ఉన్న వారు పోటాపోటీ ధర్నాలకు దిగారు. అసలు బాధితుల్ని మాత్రం రాజకీయంలో ముంచెత్తి నడిరోడ్డుపై పడేయడానికి సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది.