హుజురాబాద్ ఉపఎన్నికలో ఘోర పరాజయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో సమీక్ష నిర్వహించింది. తెలంగాణలో ఎలా అయితే గ్రూపులుగా మారిపోయి ఓటమి బాధ్యత మీరంటే మీరని ఎలా రచ్చ చేసుకుంటారో హైకమాండ్ ముందు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సమీక్షకోసం వెళ్లిన వారంతా రెండు వర్గాలుగా విడిపోయి తప్పు మాది కాదని వాదనలు వినిపించారు. హుజురాబాద్ ఎన్నికలకు ఓ ఇంచార్జ్‌గా పని చేసిన పొన్నం ప్రభాకర్ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై మండిపడ్డారు. ఉత్తన తన సమీప బంధువు అయిన కౌశిక్ రెడ్డి కోసం టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన మాటలు తప్పయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ చేశారు.
కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ విజయం కోసం సహకరిస్తున్నారని ఇలాంటి పరిస్థితి ఉంటేవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుదంని పొన్నం ఆందోళన వ్యక్తం చేసారు. అదే సమయంలో ఉత్తమ్ వర్గంగా పేరు పడిన మల్లు భట్టివిక్రమార్క మరో వాదన వినిపించారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుని ఉండాల్సిందన్నారు. బీజేపీలో చేరడానికి ముందు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ కలిశారు. రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కానీ అప్పటికి ఆయన పీసీసీ చీప్ కాదు. ఈటలను పార్టీలో చేర్చుకోవాలని.. వద్దని కాంగ్రెస్‌లో పంచాయతీ నడిచింది. అప్పుడు భట్టి విక్రమార్క కూడా హైకమాండ్‌కు ఈటలను చేర్చుకోవద్దని సందేశం పంపారు.
సమీక్ష చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని గుర్తు చేసి భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. చేర్చుకోవద్దని చెప్పి.. ఇప్పుడు కొంత మంది కుట్ర చేశారని చెప్పడమేమిటని ప్రశ్నించారు. దీంతో భట్టి విక్రమార్క సైలెంటయిపోయారు. పార్టీ కోసం ఎవరూ కష్టపడకుండా కష్టపడిన వాళ్లను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు సమీక్షలో ఒకరికొకరు చేసుకున్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పటికీ మారదన్న అభిప్రాయం.. వారిలోనే ఏర్పడింది.