వివేకా హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. రెండు రోజుల కిందటే తాను అప్రూవర్‌గా మారతానని ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ నిందితులకు అందింది. అందులో ఉన్న వివరాలను బట్టి అందరి చూపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై పడుతోంది. వైఎస్ కుటుంబసభ్యులే వివేకా హత్యకు ప్లాన్ చేశారని బలమైన అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. దస్తగిరి వాంగ్మూలంతో అది మరోసారి నిరూపితమయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సీబీఐ దాదాపుగా నాలుగు నెలలుగా నిరాటంకంగా విచారణ జరుపుతోంది. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను పిలిచి ప్రశ్నించారు. అయితే ఎప్పుడూ అరెస్ట్ చేయడం.. అదుపులోకి తీసుకోవడం వంటివి చేయలేదు. అయితే ఇప్పుడు కేవలం దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంటేనా లేకపోతే ఏమైనా ఇతర ఆధారాలు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతరులపై ఉన్నాయా అనేదే కీలకం. నిందితుడి వాంగ్మూలం కీలకమే కానీ … ఆధారాలు కూడా ముఖ్యమే. ఈ విషయంలో సీబీఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రధానమైన సందేహం !
గతంలో ఆధారాలు కావాలంటే సీబీఐ పేపర్ ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకూ వివేకా హత్యలో పాల్గొన్న నిందితుల్ని పట్టుకున్నారు. విచారణ తీరుపై ఎన్నో అనుమానాలను సామాన్యులు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికి సీబీఐ తాను అనుకున్నట్లుగా విచారణ జరిపింది. నేరుగా హత్యలో పాల్గొన్న వారిని పట్టుకుంది. ఇప్పుడు ఎవరు కుట్ర చేశారో వాళ్లను తేల్చాల్సి ఉంది. దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చినంత మాత్రాన వారికి శిక్ష పడిపోదు.
ప్రస్తుత దస్తగిరి వాంగ్మూలం రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది. వారు పరస్పర విమర్శలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ.. వైఎస్ అవినాష్ రెడ్డిని ఆయన తండ్రితో పాటు కుట్ర చేసిన వారిని శిక్షించడానికి అవసరమైన బలం ఇవ్వదు. సీబీఐ అధికారికంగా ఆధారాలు సేకరించి నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడే సామాన్యులకు కూడా కాస్త నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఈ కేసును కూడా మసిపూసి మారేడు కాయ చేసి.. ఏమీ లేదు అనిపిస్తే దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో మరింత నమ్మకం సన్నగిల్లిపోతుంది.