రాష్ట్ర స్థాయిలో బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే వారి మధ్య ఆ పొత్తు విషయంలో క్లారిటీ లేదు. ఇక స్థానిక ఎన్నికల విషయంలో జనసేన అధినాయకత్వానికి క్లారిటీ ఉంటుందని అనుకోవడం కష్టమే. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కడికక్కడ జనసేన నేతలు టీడీపీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పొత్తులో ఉన్న బీజేపీ-జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో మినీ స్థానిక సమరం జరుగుతోంది. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో చాలా చోట్ల స్థానిక నేతలు పరిస్థితులకు తగ్గట్లుగా పొత్తులు పెట్టుకున్నారు. నెల్లూరులో జనసేన – బీజేపీ పొత్తు ఉందో లేదో ఎవరికీ క్లారిటీ లేదు. చాలా చోట్ల రెండు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఆ పార్టీల నేతలు ఉమ్మడి అభ్యర్థిగా ఎవర్నీ చెప్పడం లేదు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో తెలుగుదేశం, జనసేన, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. 13 వార్డుల్లో తెలుగుదేశం, 6 వార్డుల్లో జనసేన, 1 వార్డులో సిపిఎం అభ్యర్థులను బరిలో నిలాయి. పెనుగొండ జడ్పీటీసీకి జరుగుతున్న ఉపఎన్నికలో జనసేనకి మద్దతుగా టీడీపీ బరి నుండి వైదొలిగింది. ఇతర చోట్లా కూడా టీడీపీ జనసేనకు సహకరిస్తోంది. ఇదంతా పవన్ కల్యాణ్‌కు తెలుసో లేదో కానీ.. ఆయన మాత్రం బీజేపీ- జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఇవి స్థానిక ఎన్నికలు కాబట్టి.. పవన్ పిలుపునిచ్చినా స్థానిక పరిస్థితుల్ని బట్టే గెలుపోటములు ఉంటాయని… జనసైనికులు సర్ది చెప్పుకుంటున్నారు.