ఓ సినిమా హిట్ ఫట్ అని తేల్చేది ఆ సినిమా అల్లుకున్న కథ.. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక చిన్న సినిమాల దర్శకులైతే వారి మెదడుకి పదును పెట్టారనుకోండి. రచయితలు, దర్శకుల్లో ఈ మార్పు పరిశ్రమ మంచికే అయితే కొత్త ప్రయత్నాలు చేస్తున్నా సరే మళ్లీ మూస సినిమాలు వరదల్లా వస్తున్నాయి.
వీటి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. నెలకు వందల సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో కొత్త కథలతో వచ్చే సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇక కథ ఎలాంటిదైనా కమర్షియల్ హంగులను అద్దటం సినిమాను ఎటు కాకుండా చేయడం అలవాటుగా మారింది. అయితే తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటుంటే ఎప్పుడు అవే కథలు అవే కథనాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు దర్శక నిర్మాతలు.
దర్శకులు తాము ఒక సినిమా తీసేప్పుడు ఇదే పాయింట్ తో వేరే సినిమా ఏదన్నా వచ్చిందా లేదా.. లేక ఇదే కథను చెప్పే సందర్భం ఉన్న సినిమాలు ఏమన్నా వచ్చాయా లేదా అని ఆలోచించాలి.. సినిమాకు మంచి టైటిల్ పెట్టి రిలీజ్ కు వారం రోజుల ముందు ప్రమోషన్ తో హడావిడి చేయడం మాములే. తీరా థియేటర్ లో ఆడియెన్స్ సినిమా చూసి ఈ సినిమా ఫలానా సినిమాలా ఉంది అనేస్తున్నారు. అయితే కొత్త కథలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలనే ఆలోచన దర్శక నిర్మాతలకు ఉన్నా ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది.
మరి ఈ మూస కథల ప్రవాహం ఎప్పటిదాకా కొనసాగుతుందో తెలియదు కాని.. టెక్నికల్ గా వేరే భాషల వారికి గట్టి పోటీనిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ ఇలాంటి సినిమాల వల్ల అపవాదాలు మూటకట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దర్శక నిర్మాతలు దీన్ని గమనించి కొత్త కథలను ఎంకరేజ్ చేస్తే బెటర్..!