సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ముగిసింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ప్రకారం మొత్తం 51 పెండింగ్ ఇష్యూల్లో 40 పరిష్కరించేశారట. అయితే ఏ సమస్యలు పరిష్కరించారన్నదానిపై లిస్ట్ ఆయన పెట్టలేదు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో మాట్లాడి ప్రత్యేకంగా తమ సమస్యలను ప్రస్తావించారు. వాటిలో ఎన్నింటికి పరిష్కారాలు లభించాయో ఏపీ ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తమిళనాడు నుంచి రావాల్సిన తెలుగు గంగ నిధుల దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ జగన్ చాలా సమస్యలు ప్రస్తావించారు.
అలాగే రుణ పరిమితి పెంపు కోసం కూడా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని తమకు కోత వేశారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిష్కారమయ్యాయో లేదో స్పష్టత లేదు. కేంద్రంతో సంబంధిచినవి కాకపోయినా పొరుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న సమస్యలకు అయినా ఏపీ వాటికి పరిష్కారం లభించిందో లేదో ప్రభుత్వమే ప్రకటన చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఉమ్మడి ఆస్తుల విభజన, తమిళనాడు నుంచి రావాల్సిన నిధులు, కుప్పం పాలారు ప్రాజెక్ట్ ఇలా మ్యూచవల్ సమస్యలకు అయినా ప్రభుత్వం పరిష్కారం తీసుకొచ్చిందో లేదో చూడాల్సి ఉంది.
సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి కేరళ, తమిళనాడు, తెలంగాణ సీఎంలు హాజరు కాకపోవడంతో కళ తప్పింది. బీజేపీ పాలితరాష్ట్రాలు అయిన కర్ణాటక, పాండిచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఆతిధ్యరాష్ట్రంగా ఏపీ సీఎం హాజరయ్యారు. అయితే సమావేశం సక్సెస్ ఫుల్ అని అమిత్ షా ప్రకటించేశారు కాబట్టి.. సమావేశం కోసం సుమారుగా రూ. యాభై కోట్ల వరకూ ఖర్చు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి ఎంత మేర సమస్యలు పరిష్కారమయ్యాయో తేలాల్సి ఉంది.