ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి పిటిషన్లపై విచారణ సాగడం ఇష్టం లేనట్లుగా ఉంది. చాలా రోజుల తర్వాత విచారణ ప్రారంభమైతే వెంటనే.. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ కాకుండా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల్ని ధర్మాసనం నుంచి తప్పించాలని విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం రాజధాని పిటిషన్లకు ప్రాధాన్యం ఉందని.. ఆలస్యం కానీయబోమని స్పష్టం చేసి.. వారి విజ్ఞప్తిని తోసి పుచ్చారు.
న్యాయమూర్తులపై ఎందుకు అభ్యంతరం చెబుతారో కానీ ప్రభుత్వ లాయర్లు న్యాయవ్యవస్థను కూడా కించ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బెంచ్ మార్చాల్సి వస్తే విచారణ వాయిదా వేస్తారని ఆ వ్యూహంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని.. ఇదంతా న్యాయప్రక్రియపై ప్రజల్లో అనుమానాలను కల్పించే వ్యూహామని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ లాయర్ల వాదనను చీఫ్ జస్టిస్ తిరస్కరించడంతో విచారణ ప్రారంభమయింది.
రాజధాని పిటిషన్లు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయినట్లుగా కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. వేగంగా ఈ పిటిషన్లను పరిష్కరిస్తామన్నారు. హైబ్రిడ్ పద్దతిలో విచారణ జరుగుతోంది. రైతుల తరపున శ్యాందివాన్ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ రోజువారీగా సాగుతుందా .. లేదా అనేదానిపై ధర్మాసనం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.