మంచి కథ ఏ భాషలో తీసినా బాగా ఆడుతుంది. ఎమోషన్ ని పట్టుకోవాలంతే. ఈ విషయాన్ని నిరూపించిన సినిమా దృశ్యమ్. ఈ మలయాళ కథని దాదాపు అన్ని భాషల వాళ్లూ రీమేక్ చేశారు. దాదాపు అన్ని చోట్లా ఒకటే ఫలితం.. సూపర్ హిట్. ఓ సూపర్ హిట్ కథని సీక్వెల్ చేసి, మళ్లీ హిట్ కొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ దృశ్యమ్ 2 కూడా మలయాళంలో సూపర్ హిట్టయ్యింది. ఓరకంగా దృశ్యమ్ కంటే ఎక్కువ వసూళ్లని సాధించింది. ఎక్కువ ప్రశంసల్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేశారు. దృశ్యంలో కనిపించిన తారాగణమే.. ఈ సీక్వెల్ లోనూ దర్శనమిచ్చింది. పాత్రలు అవే. కథ కొనసాగింతంతే. ఆరేళ్ల తరవాత.. రాంబాబు జీవితంలో ఏం జరిగింది? అనేదే దృశ్యం 2 కథ. నవంబరు 25న ఈచిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ వచ్చింది.
దృశ్యం 1లో కథ ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచే ఈ సినిమా మొదలవుతుంది. ఆరేళ్ల తరవాత.. పాత కేసుని ఎలా తిరగతోడి, రాంబాబుని మళ్లీ ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తారో కళ్లకుకట్టారు. దృశ్యంలో వెంకీ.. ఓ సీడీ షాపు యజమాని. ఈసారి థియేటర్ కట్టి ఓనర్ అయిపోతాడు. ఓ సినిమా తీసి, నిర్మాతగానూ మారాలనుకుంటాడు. రాంబాబు సినిమాపై ఫోకస్ చేయడంతో… ఇదే అనువుగా భావించిన పోలీసులు ఆరేళ్ల క్రితం జరిగిన మిస్సింగ్ కేసుని మళ్లీ బయటకు తీస్తారు. ఈసారి రాంబాబు దొరికాడా? లేదా? తన తెలివి తేటల్ని వాడి, మళ్లీ కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగిలిన కథ. మలయాళ వెర్షన్నిఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయినట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. దృశ్యం సమయంలోనూ ఇంతే. మాతృకని
కట్ కాపీ పేస్ట్ చేశారు. అందుకే హిట్ దక్కింది. ఈసారీ ఎవరూ రిస్క్ తీసుకోదలచుకోలేదు. అందుకే… అదే మంత్ర ఫాలో అయ్యారు. ఈసారి ఓటీటీలో వస్తోంది కాబట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం వుంది.