ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏపీ ప్రభుత్వం చేసే ప్రకటనల గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కువే. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రోడ్ల మరమ్మతులకు కనీస మొత్తం కూడా కేటాయించలేదు. కానీ పెట్రోల్, డీజిల్పై సెస్ వసూలు చేస్తున్నారు. ఆ మొత్తం ఎటు పోతోందన్న సంగతి పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం చాలా కాలంగా రూ. రెండు వేల కోట్లతో రోడ్లను బాగు చేస్తున్నామన్న ప్రకటనలు చేస్తూనే ఉంది. అద్దాల్లాంటి రోడ్లరు రోడ్ మ్యాప్ అంటూ అధికార పార్టీ పత్రిక అనేక సార్లు ఉదరగొట్టింది.
గత ఏడాది.. ఈ ఏడాది కూడా సీఎం జగన్ సమీక్షలు చేసినప్పుడు అవే హెడ్ లైన్స్ పెట్టి అదరగొట్టింది. రోజులు గడిచిపోతున్నాయి కానీ రోడ్ మ్యాప్ అందుబాటులోకి రాలేదు. నిన్నటికి నిన్న సమీక్ష చేసిన సీఎం జగన్ కొత్త రోడ్ల సంగతి పక్కన పెట్టి ముందు గుంతలు పూడ్చాలని ఆదేశాలిచ్చారు. ఏకంగా రాష్ట్రంలోఉన్న రహదారులన్నీ.. అంటే 46వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమం 2022 జూన్ కల్లా పూర్తి చేయాలట. గుంత పూడ్చే ముందు ఫోటో తీసి.. పూడ్చిన తర్వాత మళ్లీ ఫోటో తీసి నాడు-నేడు అని ప్రచారానికి పనికొచ్చేలా చేసుకోవాలట.
చాలా ప్రచార ఆశలు ఉన్నాయి కానీ.. పని మాత్రం చాలా తక్కువగా జరుగుతోంది. ప్రజలే తమ కు కష్టం వస్తే రోడ్లు వేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో ఓ వ్యక్తి కొడుకు పెళ్లికి కష్టం అవుతోందని రెండు లక్షలు పెట్టి రోడ్డుకు రిపేర్ చేయించారట. ఇలాంటివి విని .. మరో వైపు ప్రభుత్వ ప్రకటనలు విని ప్రజలకు ఏదో తెలియని విరక్తి వస్తోంది కానీ రోడ్లకు మాత్రం మోక్షం కలగడం లేదు.