ఎన్డీఏలో మిత్రపక్షాలు లేరు కానీ వ్యవస్థల్లో మాత్రం బీజేపీకి రాజకీయ మిత్రపక్షాలు ఉన్నాయి. సీబీఐ, ఈడీ బీజేపీకి లెఫ్ట్ అండ్ రైట్‌గా పని చేస్తున్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల కోసమే ఈ రెండింటిని ఉపయోగిస్తూ .. అవసరమైన వారిపై దాడులు, కేసులు చేయిస్తూ కావాల్సినంతగా అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు. అవి రెండు స్వతంత్ర్య వ్యవస్థలు. అయినప్పటికీ వాటికి చీఫ్‌లను గుప్పిట్లో పెట్టుకుని కావాల్సిన రాజకీయం చేస్తున్నారు.
ఇప్పుడు రెండు వ్యవస్థల్లో ఒకటైన ఈడీ చీఫ్ రిటైరవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ ఆయన పదవి కాలాన్ని వచ్చే ఎన్నికల వరకూ పొడిగించేసింది. ఆయనకు పొడిగింపు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్‌గా ఉన్న ఎస్కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ విరణ చేయాల్సి ఉంది. నిజానికి ఆయన గత ఏడాదే సర్వీసు పూర్తి చేసుకున్నారు. కానీ 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది. అది కూడా పూర్తవుతోంది.
ఇప్పుడు ఆయన లేకపోతే మళ్లీ తమకు ఇబ్బందులు వస్తాయనో.. లేకపోతే ఎన్నికలకు ముందు కావాల్సిన లక్ష్యాలను సాధించలేమని అనుకున్నారో కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేశారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఏకంగా ఐదేళ్లకు పెంచుతూ అందులో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడే ఆర్డినెన్స్‌లు తెస్తారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. అయినా ఆర్డినెన్స్ తెచ్చారు. పైగా పదవి కాలం పొడిగింపు ఇలా ఏళ్ల తరబడి ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. మొత్తానికి వ్యవస్థలను బలోపేతం చేయడం కన్నా రాజకీయంకు వాడుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ వ్యవస్థలే దాడులు చేస్తాయి కాబట్టి ఎవరికీ ధైర్యం ఉండటం లేదు.