జగపతి బాబు కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా `లెజెండ్`. ఈ సినిమాతోనే జగ్గూభాయ్‌గా మారాడు జగపతి. మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగ్గూభాయ్ లో ఏ స్థాయి విలన్ ఉన్నాడో, ఆసినిమాతో అర్థమైంది. ఆ తరవాత.. జగపతిబాబు ఇక ఆగలేదు. హీరోగా కంటే, విలన్ గా మారాకే పది రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు. ఇప్పుడు యేడాదికి కనీసం 20 సినిమాలైనా చేస్తున్నాడు. ఇదంతా లెజెండ్ ఇచ్చిన బూస్టపే. ఇప్పుడు `అఖండ`తో శ్రీకాంత్ కూడా మరో జగ్గూభాయ్ అవుతాడా? అనే ఆసక్తి రేగుతుంది.
శ్రీకాంత్ కూడా.. జగపతి బాబు కూడా హీరోగా తన కెరీర్ చివరి అంచుల్లో ఉన్నాడు. తన ఉనికిని కాపాడుకోవాల్సిన టైమ్ ఇది. లెజెండ్ తో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ అయ్యిందో, అఖండతో.. శ్రీకాంత్ కెరీర్ అలా మారే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే… అఖండ ట్రైలర్ చూస్తే .. బాలయ్య పాత్రలానే, శ్రీకాంత్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉందన్న సంగతి అర్థమైంది. శ్రీకాంత్ గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా అనిపించాయి. ఈ సినిమా గనుక క్లిక్ అయితే.. శ్రీకాంత్ కెరీర్ రూపు రేఖలు మొత్తం మారిపోతాయి. కాకపోతే.. శ్రీకాంత్ కి విలన్ గా నటించడం ఇదే కొత్త కాదు. తన కెరీర్ విలనిజంతోనే ప్రారంభమైంది. ఆమధ్య ఒకట్రెండు సినిమాల్లోనూ విలన్ గా నటించాడు. కాకపోతే.. ఇంత భారీ సినిమాలో ప్రతినాయకుడిగా అవకాశం రావడం ఇదే తొలిసారి. మరి… శ్రీకాంత్ కెరీర్‌కి అఖండ ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.