హిట్టో, ఫట్టో… చిన్నదో, పెద్దదో – ప్రతీవారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. కాకపోతే.. మీడియం రేంజు సినిమాలు ఈమధ్య ఎక్కువగా వచ్చాయి. ఈ వారం మాత్రం అన్నీ చిన్న సినిమాలే. కాకపోతే.. ఒకేసారి ఏకంగా 8 సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల అవుతోంది.
రావణలంక, మిస్టర్ లోన్లీ, ఊరికి ఉత్తరాన, అసుర్, స్ట్రీట్ లైట్, పోస్టర్, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు ఈనెల 19న థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అద్భుతం సినిమా హాట్ స్టార్ ద్వారా ఓటీటీలో విడుదల అవుతోంది. ఇవన్నీ చిన్నవే. అద్భుతం తప్ప.. మిగిలిన సినిమాల్లో హీరో పేర్లు కూడా జనాలకు సరిగా తెలీవు. ఈ వారం దాటితే.. మీడియం రేంజు సినిమాల హడావుడి మళ్లీ మొదలైపోతుంది. అందుకే… చిన్న సినిమాలన్నీ గంపగుత్తగా వచ్చేస్తున్నాయి. ఓటీటీలో వస్తున్న అద్భుతం సినిమాపై మాత్రం కొన్ని ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే.. ఈ సినిమా కాన్సెప్ట్ కాస్త విభిన్నంగా కనిపిస్తోంది. తేజ సజ్జ, శివానీ జంటగా నటిస్తున్నారు. రెండూ తెలిసిన మొహాలే. తేజకి జాంబీ రెడ్డి లాంటి హిట్ వుంది. అందుకే అద్భుతంపై జనాలు ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.