ఓ వైపు ‘ఆర్.ఆర్.ఆర్’, మరో వైపు ‘రాధే శ్యామ్’.. ఈ సంక్రాంతికి రెండు కొదమ సింహాలు తలపడుతున్నాయి. వీటి మధ్య ఇరుక్కోవడం ఏ సినిమాకి ఇష్టం ఉంటుంది? అందుకే `సర్కారు వారి పాట` వెనక్కి తగ్గింది. ఏకంగా ఏప్రిల్ కి షిఫ్ట్ అయిపోయింది. భీమ్లా నాయక్ కూడా వాయిదా బాట పడుతుందని అనుకున్నారంతా. కానీ… భీమ్లా ముక్కోణపు పోటీకి సిద్ధపడిపోయాడు. ఈ సినిమాని ముందే అనుకున్న సమయానికి (జనవరి 12)న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్సయిపోయారు. ఈరోజు భీమ్లా నాయక్ కి సంబంధించిన కొత్త పోస్టర్ బయటకు వచ్చింది. అందులో రిలీజ్ డేట్ ని మరోసారి పక్కా చేశారు. జనవరి 12నే వస్తున్నట్టు ప్రకటించారు.
ఆర్.ఆర్.ఆర్ జనవరి 7న వస్తోంది.అంటే.. భీమ్లా నాయక్ కోసం కేవలం 5 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నట్టు లెక్క. మరో రెండు రోజుల తరవాత అంటే.. జనవరి 14న `రాధే శ్యామ్` వచ్చేస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఒకే ఒక్క రోజు గ్యాప్. సంక్రాంతి లాంటి పెద్ద పండగల సమయంలో .. ఒకే సీజన్లో 4 సినిమాలు రావడం కొత్తేం కాదు.కానీ ఇంతింత పెద్ద పెద్ద సినిమాలు ఒకే సారి రావడం.. విశేషమే. సినీ అభిమానులకు ఇదే అసలు సంక్రాంతి. కాకపోతే.. మూడు థియేటర్లకు సరిపడా థియేటర్లు ఉన్నాయా? థియేటర్లు పంచుకుంటే, వసూళ్లు సరిపడినంత వస్తాయా? అనేదే పెద్ద ప్రశ్న. మరోవైపు `బంగార్రాజు` కూడా ఈ సంక్రాంతికే వస్తానని ఫిక్సవుతున్నాడు. అదీ వస్తే… థియేటర్ల సమస్య మరింతగా పెరిగే ఛాన్స్ వుంది.