టీడీపీ నేతలు గ్రామాల్లో పనులు చేసిన వాటికి జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల కోర్టుకేసులు పడ్డాయి. చివరికి కోర్టులో వారికి బిల్లులు చెల్లించాలని తీర్పు వచ్చింది. అయితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలో పనులు చేస్తున్న వైసీపీ నేతలకు కూడా బిల్లులు రావడం లేదట. ప్రతిష్టకు పోయి పనులు చేసి ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నేరుగా ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎక్కడా సీఎంను విమర్శించకుండా అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ తాను చెప్పాలనుకున్నదంతా చెప్పారు.
మన ప్రభుత్వంలో ఏ పనులూ చేయకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ప్రతిష్టకు పోయి ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా స్థానిక సంస్థల నేతలు పెద్ద ఎత్తున గ్రామాల్లో పనులు చేస్తున్నారని వారెవరికి బిల్లులు రావడంలేదని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పనికి ఆహార పథకం కింద చేపట్టిన వాటికీ బిల్లులు రావడంలేదని ఆయన అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లో సిమెంట్, స్టీల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ విషయాలన్నింటినీ తాను పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంత మంది అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారని దీని వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన చెబుతున్నారు. పార్టీ నేతలు నష్టపోతున్నారని… వారు నష్టపోతే పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టే తాను మాట్లాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంపై అప్పుడప్పుడూ విమర్శలు చేస్తూ హైలెట్ అవుతూ ఉంటారు.