కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందట. ఈ విషయాన్ని ఎస్ఈసీ నీలం సాహ్ని ప్రకటించారు. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఉన్నాయని..వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామని ఆమె చెప్పారు. చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా కుప్పంలో మకాం వేసి పరిస్థితుల్ని సమీక్షించారు.. పోలింగ్ కేంద్రాల బయట జరిగిన చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతమేనని రిపోర్ట్ వచ్చిందని ఆమె ప్రకటించారు. రీపోలింగ్ కోసం ఎక్కడా విజ్ఞప్తులు రాలేదు కాబట్టి ఎక్కడా రీపోలింగ్ నిర్వహించడం లేదన్నారు.
దొంగ ఓటర్లపై ఏ నివేదిక రాలేదని.. ఆమె చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల అధికారులు కౌంటింగ్ లోనూ తమ కళలు ప్రదర్శిస్తారని భయపడ్డ టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని..అంతా వీడియో రికార్డింగ్ చేయించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డిని స్పెషలాఫీసర్‌గా నియమించిన హైకోర్టు… లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆ వీడియోలను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని ఎస్ఈసీని ఆదేశించింది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తూండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నామినేషన్ల దగ్గర్నుంచి పోలింగ్ వరకూ ప్రతీ చోటా వివాదాలు ఏర్పడ్డాయి. పోలింగ్ రోజు దొంగ ఓటర్లు వెల్లువలా వచ్చినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్‌లోనూ అక్రమాలకు పాల్పడతారన్న ఉద్దేశంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.