జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లగా రాజకీయ కార్యకలాపాలు పెంచుతున్నారు. సోషల్ డాక్టర్‌గా ఓ సందర్బంలో తనను తాను ప్రకటించుకున్నట్లుగానే వివిధ సామాజికవర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి మత్స్యకారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. వచ్చే ఆదివారం ఆయన నర్సాపురం పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మత్స్యకారుల బహిరంగసభను జనసేన నిర్వహిస్తోంది. ఆ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం.
వైసీపీ ప్రభుత్వం ఇటీవల మత్స్యకారులను ఇబ్బంది పెట్టే జీవో ఒకటి తీసుకు వచ్చింది. చేపల చెరువును మత్స్యకార సొసైటీల నుంచి తప్పించి వేలం ద్వారా ఇచ్చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరులోఅమలు చేయడం ప్రారంభించింది. మత్స్యకార సొసైటీల పేరుతో అన్నీ దళారుల చేతుల్లో ఉన్నాయని అందుకే జీవో తీసుకొచ్చి వేలం వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల చెరువుల్ని వైసీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకోవడానికే చేపల చెరువుల హస్తగతానికే బహిరంగ వేలం విధానాన్ని తెచ్చి, మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.