ఊర్లో బేవార్సుగా తిరిగే ఓ అబ్బాయి. పందాల రాయుడు. జూద శిఖామణి.. కలలన్నీ గల్లంతైపోయి, మేడలన్నీ బళ్లై, బళ్లు ఓడలై.. ఓడిపోయి – చివరికి సెక్యురిటీ గార్డ్ గా మారి, జీవితాన్ని, జీవిత సారాన్ని తెలుసుకుని, మళ్లీ ఊరెళ్లి.. అక్కడ ఎలా గెలిచాడన్న కథతో రూపొందుతున్న సినిమా… `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఈనెల 26న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర.. బంగారం. తన కామెడీ టచ్‌తో.. ఈ పాత్రని రాజ్ తరుణ్ అలవోకగా లాగేశాడనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. దాంతో పాటు డబ్బు, బంధాల విలువ కూడా ఈ సినిమాలో చెప్పడానికి ప్రయత్నించారనిపించింది.
రూపాయి పాపాయి లాంటిదిరా..
దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలిగానీ, ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టకూడదు.. – అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. చిన్నప్పటి నుంచీ జల్సాలకు అలవాటు పడిన కుర్రాడిగా బంగారం కనిపించాడు.
`బంగారం గాడి మనసు సినిమాహాల్ లాంటిది..
వారానికో సినిమా వస్తుంటది.. పోతుంటది
ఏదీ పర్మెనెంట్ గా ఆడదిక్కడ..“ అనే డైలాగ్ తో రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఆవిష్కరించారు. అలాంటి కుర్రాడికి శ్రుతి అనే అమ్మాయి తగులుతుంది. తనకేమో.. సెక్యురిటీ గార్డులంటే అలర్జీ. ఊర్లో ఆస్తుల్ననీ అమ్మేసుకుని, పట్నంలో సెక్యురిటీ గార్డుగా బతికేస్తున్న రాజుతో… శ్రుతి ప్రేమలో పడిందా, లేదా? అనేది మరో కథ.
“వచ్చే సంవత్సరం ఇదే రోజు… ఇక్కడే జెండా ఎగరేస్తా…
బంగారంగా కాదు. ప్రెసెడెంటు బంగారంగా..
ఏయ్‌రా.. నామినేషను“ అనే ఫైనల్ టచ్‌తో హీరో గోల్, దానికి ఎదురయ్యే విలన్ బ్యాచ్ గురించి అర్థమవుతోంది. మొత్తానికి రాజ్ తరుణ్ ఈ సినిమాతో మరో ఫన్ రైడ్ ఇవ్వబోతున్నాడని అర్థమైంది. పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు ఈమధ్య కాలంలో పెద్దగా రావడం లేదు. ఆ కొరతని అనుభవించు రాజా కొంత వరకూ తీర్చొచ్చు.