మినీ లోకల్వార్లో తెలుగుదేశం పార్టీకి గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు పూర్తి స్థాయిలో జరిగిన మున్సిపల్ , పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో చెప్పుకోవడానికి కూడా సరైన ఫలితాలు రాలేదు.కానీ మినీ లోకల్ వార్లో మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని నగర పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చోట మాత్రం ఆ పార్టీ ఘన విజయాలు నమోదు చేసింది.
కుప్పంలో గెలుపు కోసం ఎంత వరకైనా తెగించిన వైసీపీ పంతం నెరవేరింది. ఎన్నికలు ఎలా జరిగాయన్న విషయం పక్కన పెడితే మొత్తం 25 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి కూడా పరాజయం పాలయ్యారు. ఆరు వార్డుల్లోనే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క డివిజన్ కూడా టీడీపీకి రాలేదు. పెనుకొండ, బుచ్చి నగర పంచాయతీల్లో రెండు చోట్ల వార్డు సభ్యులు గెలిచారు.
మిగిలిన చోట్ల టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. అసలు టీడీపీకి నాయకుడే లేని నియోజకవర్గం అయిన దర్శి నగర పంచాయతీని టీడీపీ గెల్చుకుంది. అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అందరూ వైసీపీలోనే ఉన్నారు. అయినా టీడీపీ గెలిచింది. పోటీ చేయడానికే టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురైన దాచేపల్లి లాంటి చోట్ల కాస్తలో విజయం మిస్ అయింది. ఇక కొండపల్లి, జగ్గయ్యపేట సహా ఇతర నగర పంచాయతీల్లో మెరుగైన ఫలితాలే సాధించారు. గుంటూరులో ఆరో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ గెలిచింది.
వైసీపీ నేతలు తాడో పేడో అన్నట్లుగా తీసుకుని పెద్ద ఎత్తున ఖర్చుకు వెనుకాడని చోట వైసీపీ విజయాలు సాధించింది. అలా కాకుండా లైట్ తీసుకున్న చోట టీడీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు టీడీపీ నేతల్లో కాస్త ఆశలు నింపుతున్నాయి. ఇన్ని నిర్బంధాలు.. ఎలాంటి వనరులు లేని పరిస్థితుల్లోనూ టీడీపీకి ఈ మాత్రం ఓట్లు రావడం వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.