వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత దేవిరెడ్డి శంకర్ రెడ్డి పులివెందుల నుంచి మాయం అయ్యారు. అనారోగ్యం కారణం చెప్పి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిపోయారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలోనే అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది.
దేవిరెడ్డి శంకర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తరపున షాడో ఎంపీగా వ్యవహరిస్తూంటారు. వైఎస్ఆర్సీపీ పనులు అన్నీ చేస్తూంటారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయననే ప్రత్యక్షంగా ఉన్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే సీబీఐ అధికారులు ప్రశ్నించారు కానీ అరెస్ట్ చేయలేదు. దస్తగిరి కన్ఫెషన్ రిపోర్ట్ తర్వాత ఆయనను అరెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
దస్తగిరి అప్రూవర్‌గా మారతానని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదట్లో వివేకా హత్య కేసు పాత్రధారుల్ని అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు సూత్రధారులపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. త్వరలో ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది.