ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా నిర్థారణ అయింది. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత వారం మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. గవర్నర్ల సదస్సులో పాల్గొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. రాజ్ భవన్ వైద్యులు పరీక్షించి ప్రాథమిక చికిత్స చేశారు.
అయితే ఒక రోజు అయినా తగ్గకపోవడంతో కరోనాగా అనుమానించారు. ఆయన వయస్సు 87 ఏళ్లు కావడం.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని నిర్ణయించారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏఐజీ వైద్యులు ప్రకటించారు.
బిశ్వభూషణ్ ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత. ఆయన కుటుంబసభ్యులు కూడా ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. గవర్నర్ కు కరోనా నిర్ధారణ అయినట్లుగా ఏఐజీ ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది. ఆయన ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు వాకబు చేస్తున్నారు.