వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో కలిసి చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి రేసులో ఉన్నారని ఇప్పటి వరకూ ఎలాంటి ప్రచారమూ లేదు.
అయితే బీజేపీ వర్గాల్లో మాత్రం అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. దేశ అత్యున్నత పదవుల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని.. ఈ సారి రాష్ట్రపతి పదవి దక్షిణాదికి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై బీజేపీ వర్గాల్లో ఎలాంటి స్పందన ఉందో ఎవరికీ తెలియదు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుందో అంచనా వేయడం కష్టం. గతంలో అనూహ్యంగా ఎవరికీ పెద్దగా తెలియని రామ్ నాథ్ కోవింద్‌ను ప్రెసిడెంట్‌ను చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
ఇటీవల అనేక మంది కొత్త కొత్త పేర్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి సోదరుడు నాగబాబు అయితే చాలా రోజుల కిందటే రతన్ టాటాను రాష్ట్రపతిగా చేయాలని ట్వీట్ చేశారు. చర్చ పెట్టారు. ఇప్పుడు చిరంజీవి .. వెంకయ్యనాయుడుకు మద్దతు తెలిపారు.