వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇద్దరూ తెదేపాలో చేరబోతున్నట్లు ఈరోజు మీడియాలో వార్తలు వచ్చేయి. పార్టీ మారే ఉద్దేశ్యంలేని వారు అటువంటి వార్తల వలన పార్టీతో తమ సంబందాలు దెబ్బ తింటాయనే భయంతో వెంటనే వాటిని ఖండించడమే కాకుండా, తన పార్టీ అధిష్టానానికి నమ్మకం కలిగించదానికి తాము ఏ పార్టీలో చేరుతామని వార్తలు వచ్చేయో ఆ పార్టీపై విమర్శలు కూడా చేస్తుంటారు.
ఈ వార్తలపై స్పందించమని భూమా నాగిరెడ్డిని కొందరు విలేఖరులు కోరినప్పుడు “రోజూ అటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రతీ దానిపై స్పందించలేము కదా.. వాటి గురించి పూర్తి వివరాలు చేతికి అందిన తరువాత మాట్లాడుతాను,” అని జవాబు చెప్పారు. ఇదంతా చెప్పే బదులు “ఆ వార్తలను నేను ఖండిస్తున్నాను. పార్టీ మారే ఆలోచన మాకు లేదు,” అని చెప్పి ఉండి ఉంటే ఆయన పార్టీ మారడం లేదనే విషయం ఖరారు చేసినట్లుండేది. కానీ ఆయన ఖండించలేదు కనుక పార్టీ మారడం ఖాయమనే భావించాల్సి ఉంటుంది. ఆయనకి చంద్రబాబు నాయుడు మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లువార్తలు వచ్చేయి. అదే నిజమయితే ఆయన తప్పకుండా పార్టీ మారవచ్చును.
అయితే ఈ వార్తలపై ఆయన బావమరిది కర్నూలు వైకప ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన చాలా ఆలోచనాత్మకంగా ఉంది. “ప్రభుత్వం ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకే తమ నియోజక వర్గాలలో అభివృద్ధి పనులను చేయించుకోలేక అవస్థలు పడుతున్నప్పుడు తెదేపాలోకి వెళ్లి ప్రయోజనం ఏముంటుంది? తెదేపాలోకి వెళ్లి ప్రయోజనం లేనప్పుడు వైకాపాలోనే కొనసాగితే నష్టమేమిటి? అయినా భూమానాగిరెడ్డి తెదేపాలో చేరుతారని నేను భావించడం లేదు,” అని అన్నారు. కానీ భూమానాగిరెడ్డి స్పందన చూస్తే ఆయన పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నేడో రేపో ఆయనే ఈ సస్పెన్స్ కి తెర దించుతారేమో చూడాలి.