మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన ఉద్యోగంలో చేరినప్పడి నుంచి అవినీతి పరుడని చిట్టా చదువుతున్నారు. ఆయన నామినేషన్ పత్రాల్లోని అఫిడవిట్ బయటకు రాగానే ఆయన చరిత్ర అంతా చెప్పడానికి సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల అధికారులు వెంకట్రామిరెడ్డి అఫిడవిట్‌ను బయటకు రానీయలేదు. దీనిపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై హైకోర్టులో ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నామినేషన్ ఆమోదించవద్దని డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొదట్లో చంద్రబాబుకు దగ్గరగా ఉండేవారు. తర్వాత వైఎస్.. ఆ తర్వాత రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిలకూ సన్నిహితుడే. అందుకే ఐఏఎస్ సాధించారని.. ఇప్పుడు కేసీఆర్ దగ్గరా అలాగే ప్రవర్తించి అంత కంటే ఎక్కువ ప్రాధాన్యత పొందారని అంటున్నారు. హైదరాబాద్ శివారులో ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల విషయంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప సంస్థకు భూములు దక్కించుకుంది.
అదే సమయంలో సర్వీస్ రూల్స్ ను కూడా రేవంత్ తెరపైకి తెస్తున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న 24 గంటల్లోపే వెంకట్రామిరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారని అదెలా సాధ్యమని ఆయన అడుగుతున్నారు. డీవోపీటీ నుంచి అనుమతి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అఫిడవిట్ బయటపడితే.. గుట్టు అంతా ప్రజల ముందు పెట్టాలనుకున్న రేవంత్‌కు ఇంకా చాన్స్ దొరకలేదు. కానీ రేవంత్ మాత్రం వెంకట్రామిరెడ్డిని వదిలి పెట్టే అవకాశాలు కనిపించడం లేదు.