ప్రతి సంక్రాంతికి కోడి పుంజులు తలపడతాయి. ఈసారి సంక్రాంతికి ముందే.. సినిమాలు తలపడబోతున్నాయి. `నాకు దారి ఇవ్వు` అంటే.. `నాకు దారి ఇవ్వు` అంటూ… నిర్మాతలు బేరసారాలు చేసేసేకుంటున్నారు. కానీ ఏ ఒక్కరికీ తగ్గే ఉద్దేశ్యం లేదు.
ఈ సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రావడం ఫిక్సయ్యాయి. దూరం నుంచి చూస్తే… మూడు సినిమాలకు టాలీవుడ్ లో చోటు ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ దగ్గరగా వెళ్తే మాత్రం – ఇందులో రెండిటికే ఛాన్సుంది. అంటే.. ఈ మూడింట్లో ఒకటి ట్రాప్ అయితేనే, రెండింటికి లాభం. మరి డ్రాప్ అయ్యేది ఎవరన్నది పెద్ద ప్రశ్న. ఆర్.ఆర్.ఆర్.. పాన్ ఇండియా సినిమా. రాధే శ్యామ్ కూడా అంతే. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మార్కెట్లు, అక్కడి పోటీని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. తెలుగు కోసం ఆగితే – మిగిలిన చోట్ల దెబ్బడిపోతుంది. అందుకే అందరి ఈజీ టార్గెట్…. భీమ్లా నాయక్ అవుతోంది. `మీరు ఈసారికి ఆగండి` అంటూ మిగిలిన ఇద్దరు నిర్మాతలూ.. భీమ్లా నాయక్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీలైనన్ని పెద్ద మొహాల్ని రంగంలోకి దించి – భీమ్లా నాయక్ ని వెనకడుగు వేయించేలా చేస్తున్నారు.
కానీ భీమ్లా నాయక్ మాత్రం తగ్గడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ 12నే వస్తానన్నది భీమ్లా ప్రతిజ్ఞ. నిజానికి.. ఈ రేసులో చివరన వచ్చింది ఆర్.ఆర్.ఆర్. 2022 వేసవికి రావాల్సిన సినిమా ఇది. చిత్రసీమ కూడా అదే అనుకుంది. అందుకే సంక్రాంతికి ముందే కర్చీఫ్‌లు వేసుకున్నారు నిర్మాతలు. చివర్లో వచ్చి. అసలు సంక్రాంతి రేస్‌ని కలగాపులగం చేసింది ఆర్.ఆర్.ఆర్. అలాంటప్పుడు వెనక్కి వెళ్లాల్సింది ఆర్.ఆర్.ఆర్‌నే అవుతుంది. ఇదే భీమ్లా నాయక్ నిర్మాతలు అడుగుతున్న లాజిక్. కాకపోతే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ వెనక్కి వెళ్లలేదు. అయితే గియితే.. రాధే శ్యామ్ వెనకడుగు వేయాలి. కానీ… ఆ సినిమాది కూడా అదే పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈసారీ వాయిదా పడితే ఇక అంతే సంగతులు. అందుకే.. రాధే శ్యామ్ కూడా తగ్గదు.
ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చేస్తే సమస్య ఏముంటుంది? అనేది మరో ప్రశ్న. థియేటర్లు ఇచ్చి పుచ్చుకోవడం వెనుక చాలా గలాటా జరిగిపోతుంది. అది సినిమాకి మంచిది కాదు. ఈ మూడు సినిమాల్లో ఒకటి వెనకడుగు వేయాల్సి వస్తే.. లెక్క ప్రకారం, గిల్డ్ రూల్స్ ప్రకారం… రాజమౌళి సినిమానే అవ్వాలి. మిగిలిన సినిమాలపై ఒత్తిడి చేయడం న్యాయం కాదు. కాబట్టి.. వెనక్కి తగ్గితే. ఆర్.ఆర్.ఆర్ తగ్గాలి. లేదంటే మూడూ చూడాల్సిందే.