గ్రీకు వీరులమని బీరాలు పలికిన వారు బేర్ మన్నారు. మీ సహాయమూ వద్దు, సంస్కరణలూ వద్దన్న వారు యూరోజోన్ సాయం కోసం దేబిరించారు. చివరకు యూరోజోన్ దయతలిచింది. బెయిలౌట్ ప్యాకేజీకి సై అంది. అయితే, బుధవారం కల్లా సంస్కరణలపై గ్రీస్ పార్లమెంటు తీర్మానం చేయాల్సి ఉంటుంది.
ఇతర ఐరోపా దేశాల్లాగే గ్రీస్ కూడా చిన్న దేశం. కోటీ 10 లక్షల జనాభా. చేసిన అప్పులు మాత్రం భారీగానే ఉన్నాయి. సహజ వనరులు తక్కువ. ఆర్థిక వనరులు తక్కువ. అలాంటప్పుడు ఆర్థిక క్రమశిక్షణతో మెగాల్సిన దేశం రకరకాలుగా దుబారా చేసింది. సంక్షేమం పేరుతో అవసరానికి మించి ప్రజలను అలవెన్సులు ఇచ్చింది. వేతనానికీ పెన్షన్ కూ తేడా లేని విధంగా చెల్లింపులు జరుపుతోంది. రానురానూ ప్రజలకు సంక్షేమం ఎక్కువైంది. పని సంస్కృతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని రకరకాల లోన్లు తీసుకునే అలవాటు పెరిగింది.
అప్పులు పెరిగి దేశం దివాళా అంచున నిలబడింది. గతంలో ఈ పరిస్థితి ఎదురైనప్పుడు యూరోజోన్, ఐ ఎం ఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నాయి. ఆ రుణం చెల్లించాల్సిన గడువు మొన్న జూన్ 30 తో తీరిపోయింది. అయినా గ్రీస్ చెల్లించలేక పోయింది. దీంతో గ్రీస్ డిఫాల్టర్ అని ఐఎంఎఫ్ ప్రకటించింది. రిఫరెండంలో సంస్కరణలకు నో చెప్పిన దేశం ఇప్పుడు ఎందుకు ఎస్ చెప్తోందంటే అందుకు కారణాలున్నాయి. ఒకవేళ ఇప్పుడున్న 240 బిలియన్ యూరోల భారీ అప్పును ఎగ్గొట్టినా, గ్రీస్ కు పూటగడవడం కష్టం. ఖజానాలో డబ్బులు లేవు. బ్యాంకుల్లో నిల్వలు లేవు. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. నెల తిరిగేసరికి వేతనాలు, పెన్షన్లు చెల్లించే పరిస్థితి లేదు. ఎవరో ఒకరు ఆదుకోకపోతే మనుగడ కష్టం. ఆఫ్రికా దేశాల పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే షరతులకు సై అంటూ బెయిలౌట్ కోసం గ్రీస్ ప్రయత్నించింది.
యూరోజోన్ది మరో కథ. గ్రీస్ దివాళా తీస్తే పాత అప్పులు వసూలు కావు. బెయిలౌట్ ఇచ్చి గండం గట్టెక్కిస్తే భవిష్యత్తులో కోలుకుని అప్పు తీరుస్తుందనే ఆశ ఉంటుంది. అందుకే ఉద్దీపన ప్యాకేజీకి సరే అని చెప్పింది. యూకే సహా ఐరోపాలోని చాలా దేశాల పరిస్థితి ఇలాగే ఉంది. మితిమీరిన సంక్షేమం ఖజానాకు భారం మారింది. కొన్ని దేశాల్లో పిల్లల్ని కన్న దంపతులకు అలవెన్సులు ఇస్తారు. అలాంటి దేశాలకూ గ్రీస్ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆ దేశాలు వాస్తవిక దృష్టితో ఆలోచించాల్సి అవసరం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరించారు.