ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాకపోవచ్చు గానీ.. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయజనతా పార్టీకి చెందిన ఎంపీల దృక్పథం ఎలా ఉంటున్నదో, వారు ఎలా చెలరేగుతున్నారో, తెలియజెప్పే ఒక సంఘటన. దేశవ్యాప్తంగా క్షామ పరిస్థితులు తాండవిస్తూ.. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వైపరీత్యపు పరిస్థితులు కాటేస్తుండగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ పార్టీలు రాష్ట్రాల్ల పరిపాలన సాగిస్తున్నాయనే అంశంతో సంబంధం లేకుండా దాదాపు అన్నిచోట్లా ఇలాంటి దుర్ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలన్నీ మరణిస్తున్న రైతుల కుటుంబాల పట్ల సానుభూతితోనే స్పందిస్తున్నాయి.
అయితే మహారాష్ట్రకు చెందిన ఒక భాజపా ఎంపీ మాత్రం అన్నదాతల ఆత్మహత్యల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇప్పుడు ఇరుకున పెడుతున్నాయి. కొత్త వివాదంలోకి లాగుతున్నాయి.
రైతులు కేవలం కష్టాల్లో ఉండడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, ఆత్మహత్యలు అనేవి రైతులకు ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని ఈ భాజపా ఎంపీ వ్యాఖ్యలు రువ్వారు. మహారాష్ట్రకు చెందిన ఎంపీ గోపాల్‌శెట్టి ఈ వ్యాఖ్యల ద్వారా భాజపాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టారు.
భారతీయ జనతా పార్టీ దృక్పథంలోనే రైతు వ్యతిరేక ధోరణులు ఉన్నాయనే విమర్శలను వారు చాలా కాలంనుంచి మోస్తున్నారు. మోడీ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలు రైతు వ్యతిరేకమైనవిగా గతంలో కాంగ్రెస్ వాటికి వ్యతిరేకంగా పోరాడింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. భూసేకరణ వంటి బిల్లుల విషయంలో అయితే విజయం సాధించింది కూడా. అయితే వాటికీ వీటికీ ముడిపెట్టడం కష్టమే గానీ.. పార్టీ ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇరుకున పెట్టే అంశం. పార్టీ నాయకులు ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల కింద తీసుకునేంత విశాల దృక్పథం గల రాజకీయాలు మన వద్ద లేవు. ఎవ్వరు ఏం మాట్లాడినా.. వెంటనే ఆ పార్టీకి దాన్ని ఆపాదించేసి.. పార్టీ బుద్దులే అంత అంటూ విరుచుకుపడిపోవడమే మనకు తెలిసింది. ఇలాంటి దుడుకు పోకడల్లో ఏ పార్టీకి కూడా మినహాయింపులేదు. అందుకే కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని విపరీతంగా భాజపా వ్యతిరేక ప్రచారానికి వాడుకోవాలని చూస్తోంది.
అయితే ఎంపీ మాత్రం నష్టనివారణకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారాలు ఇవ్వడం ప్రభుత్వాలకు ఫ్యాషనైపోయిందని అన్నానని, దాన్ని వక్రీకరించారని ఆయన అంటున్నారు. అయినా ఇలా దిద్దుబాటు గురించి పట్టించుకునేదెవరు?