తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల్లో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న మురళీమోహన్ అప్పుడే తన రాజకీయ వారసత్వం గురించి కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా నియోజకవర్గంలో స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వారసత్వపు ఎంపిక గురించి మురళీమోహన్ దాపరికం కూడా ఏమీ ఉంచడం లేదు. తాను ఎంపీ హోదాలో పాల్గొంటున్న దాదాపు అన్ని కార్యక్రమాలకు కూడా తాను వారసురాలిగా ఎంచుకున్న కోడలు రూపాదేవిని కూడా తీసుకువెళుతూ.. ఆమెకు ఇప్పటినుంచే ప్రజాజీవితపు ట్రైనింగ్‌ను దగ్గరుండి ఇస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.
రాజమహేంద్రవరం నగరంలో ఎంపీ మురళీమోహన్ అయినప్పటికీ.. ఆయన తరఫున అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తూ చక్రం తిప్పే బాధ్యతను ఇప్పుడు ఆయన కోడలు రూపాదేవి కూడా సమంగా పంచుకుంటున్నారు. ఎంపీ పాల్గొనే అన్ని అధికార్ల సమావేశాల్లోనూ ఆమె కూడా కనిపిస్తున్నారట. ఇదంతా చూస్తోంటే వచ్చే ఎన్నికల నాటికి తన వారసురాలిగా కోడలిని రంగంలోకి దింపాలని మురళీమోహన్ ఒక స్పష్టమైన ఎజెండాతోనే ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదివరలో ఇదే నియోజకవర్గంనుంచి దెబ్బతిన్నప్పటికీ.. 2014 మురళీమోహన్ ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తన రాజకీయ పీఠాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో ఆయన చిన్న శస్త్రచికిత్స అయినప్పుడు.. తర్వాత అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన కొన్నాళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కోడలు రూపాదేవి పూర్తిస్థాయిలో నియోజకవర్గం అంతటా తిరుగుతూవచ్చారు. ప్రస్తుతం మురళీ మోహన్ స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి వచ్చింది. కానీ ఆయన వెంట రూపాదేవి కూడా వస్తున్నారు.
ఇదంతా చూస్తే.. తన రాజకీయ వారసురాలిగా కోడల్ని ఆయన ముందునుంచే ప్రజాజీవితానికి అలవాటు చేస్తున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.