అసెంబ్లీలో చేసే చట్టాలకు ఓ సార్థకత ఉంటుంది. ప్రజల జీవనాన్ని ఎప్పటికప్పుడు సులభతరం చేసేలా.. చట్టాలను చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అందు కోసం చేసే చట్టాలకు అర్థం ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఓ చట్టం ఏ విధంగా ప్రజాప్రయోజనమైనదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం అసెంబ్లీలో ఆమోదం పొందనున్న ఈ చట్టం ఏమిటంటే మద్యం ఆదాయంతో పథకాలు అమలు చేస్తాము అని చెప్పే చట్టం. అంటే పథకాలకు ఆ మద్యం సొమ్ము మాత్రమే వాడతామని ప్రత్యేకంగా చెప్పడం అన్నమాట. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవడానికి ఈ చట్టాన్ని ఓ తాకట్టుగా వాడుకుంటారు .
కానీ ప్రజల్ని తాగుబోతుల్ని చేసి వారి వద్ద నుంచి పిండుకుంటున్న డబ్బుల్ని మళ్లీ సంక్షేమం పేరుతో వాడతామని చెప్పడమే ఇక్కడ ప్రభుత్వ చట్టం ఉద్దేశం. అంటే మద్యం ఆదాయంతో డబ్బులు రాకపోతే ఆ పథకాలు అమలు చేయరా అంటే.. చేయవచ్చు..చేయకపోవచ్చు. కానీ ఇక్కడ విషయం అది కాదు. ప్రభుత్వం ఆ ఆదాయాన్ని ప్రత్యేకంగా చూపించాలనుకుంటోంది. అలా చూపించడానికి చట్టం చేయాలి. అలాచట్టం చేస్తే దాన్ని చూపించి బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టాలి.
ఇదీ అసలు విషయం. ఇలాంటి వాటికి దేశంలో ఎక్కడా చట్టాలు చేసి ఉండరు. ఏపీలోనే మొదటి సారి చేస్తూ ఉంటారు. మద్యనిషేధం విధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇలా మద్యం పై ఆదాయాన్ని ఏళ్ల తరబడి బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నమ్మలేకపోతున్న బ్యాంకులకు అసెంబ్లీని ఉపయోగించి చట్టాలు చేసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.