బీజేపీతో చెడిందో లేకపోతే ఎందుకైనా మంచిదని అడుగులు వేస్తున్నారో కానీ ఇటీవలి కాలంలో వైసీపీకి చెందిన అధికార మీడియా కాంగ్రెస్ పార్టీ విషయంలో సాఫ్ట్‌గా ఉంటోంది. ముఖ్యంగా కేంద్రంలో ఆ పార్టీ పనైపోయిందని.. ఇక రాదని ఎక్కడా చెప్పడం లేదు. వీలైనంత వరకూ పాజిటివ్ కవరేజీ ఇస్తోంది. తాజాగా ఆ పార్టీ విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నెహ్రూను అమాంతం పొగిడేస్తే ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్స్ ప్రచురించేస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ జయంతి అయిపోయిన ఐదు రోజుల తర్వాత ఆయనను కీర్తిస్తూ ఉత్తరాది కాంగ్రెస్ నేత ఒకరు రాసిన ఆర్టికల్‌ను తెలుగులో తర్జుమా చేసి ప్రచురించింది జగన్ మీడియా.
నిజానికి నెహ్రూ విషయంలో ఏ మాత్రం పాజిటివ్ వార్తలు రావడానికి బీజేపీ ఇష్టపడదు. బీజేపీకి ఇష్టం లేని పని వైసీపీ ఇప్పటి వరకూ చేయలేదు. చేసే ఆలోచన కూడా చేయలేదు. కానీ అనూహ్యంగా నెహ్రూ అంటే విరుచుకుపడే బీజేపీ దృష్టిలో పడేలా.. వ్యూహాత్మకంగానే ఆయన వారసత్వాన్ని గొప్పగా ప్రజెంట్ చేస్తూ రాసిన ఆర్టికల్‌ను ముద్రించారు. పైగా వారసత్వం అవసరం అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ తాజా తరం అధికారంలోకి రావాలన్నట్లుగా ఆ కథనం ఉంది. దీంతో వైసీపీ విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రాజకీయవర్గాలు సహజంగానే ఓ అంచనాకు వస్తున్నాయి.
అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారు. వెళ్లారు. ఈ పర్యటనలో అధికారిక భాగంలో సీఎం జగన్ ఆయనతో ఉన్నారు. ఏం మాట్లాడారో తెలియదు కానీ.. తర్వాతి రోజే.. వైసీపీ మన శత్రువు అని ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగా స్పష్టమయింది. ఆ తర్వాత సాక్షి పత్రిక.. నెహ్రూ వారసత్వం దేశానికి కావాలంటూ కథనాలు ప్రారంభించింది. మొత్తానికి ఏదో జరిగింది.. ఏదో జరగబోతోందని సాక్షి ఎడిటోరియల్ పాలసీలో వచ్చిన మార్పులే నిరూపిస్తున్నాయి.