వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా హఠాత్తుగా ఈ ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన వ్యవసాయ చట్టాల ఉద్దేశాలను రైతులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయామని క్షమించాలన్నారు. రైతు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఎలాంటి చర్చ జరగకుండా పార్లమెంట్లో సాగు చట్టాలను ఆమోదించారు. ఈ చట్టాలపై ఉత్తరాది రైతులు పోరుబాట పట్టారు. ప్రాణాలను సైతం లెక్క చేయక వారు ఢిల్లీ శివార్లలోనే ఉన్నారు. వారిపై ఖలిస్థాన్ ముద్ర వేశారు. జీపులతో తొక్కించారు. వారికి కనీస అవసరాలు అందకుండా చేయాల్సినవనన్నీ చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలు పోయినా తాము వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నానని.. ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో .. ఆ తర్వాత కూడా ఈ వ్యవసాయ చట్టాల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సూచనలు రావడంతో మోడీ సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. యూపీ, పంజాబ్ లాంటి చోట్ల బీజేపీ పరిస్థితి పడిపోతే.. అది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అందుకే ముందుకెళ్లడం కన్నా తగ్గడం మంచిదన్న అభిప్రాయంతో మోడీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యవసాయచట్టాలు అమల్లో లేవు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అమలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఎవరు ఎంత చెప్పినా కేంద్రం వినలేదు. హఠాత్తుగా మనసు మార్చుకోవడానికి ఎన్నికల ఫలితాల భయమే కారణమని అంచనా వేస్తున్నారు.