మెగా వారసుల్లో ఇమేజ్ కోసం కాకుండా ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ముకుంద, కంచెలతో విమర్శకుల ప్రశసంసలను అందుకున్న మెగా ప్రిన్స్ లోఫర్ సినిమాతో కమర్షియల్ పంథాలో వచ్చాడు. అయితే కంచె దర్శకుడితో సినిమా మొదలైనట్టే మొదలై ఆగిపోవడం.. గోపిచంద్ మలినేని సినిమా అవకాశం కూడా మిస్ అవ్వడంతో తీస్తున్న సినిమా గురి తప్పకూడదని డిసైడ్ అయ్యాడు వరుణ్ తేజ్.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ‘ఫీల్ మై లవ్’ సినిమా చేస్తున్న ఈ మెగా హీరో తన సినిమాకు సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నాడు. సినిమాకు దేవి సంగీతం అంటే సగం హిట్ అన్నట్టే లెక్క. వరుసెంట స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్న దేవి మొదటిసారి వరుణ్ తేజ్ సినిమాకు కంపోజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకు దేవి పనిచేయడానికి మరో కారణం ఈ సినిమా టైటిల్ ‘ఫీల్ మై లవ్’ కావడం.
ఆర్య సినిమాకు ‘ఫీల్ మై లవ్’ అనే సాహిత్యానికి అద్భుతమైన సంగీతం అందించిన దేవి అదే పేరుతో వస్తున్న సినిమాకు కూడా సంగీతం అందించడం చెప్పుకోదగ్గ విషయం. మరి సినిమాలైతే మంచి పేరు తెచ్చుకుంటున్నా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఆ దాహం తీరుస్తుందనే నమ్ముతున్నాడు.