రాయలసీమ కన్నీరు మున్నీరవుతోంది. విరుచుకుపడిన వరదలో కొట్టుకుపోయిన వారు కొట్టుకుపోతే ఒడ్డుకు చేరుకున్నవారు చేరుకున్నారు. మూగ జీవాలు జల సమాధి అయ్యాయి. గ్రామాలకు గ్రామాలు శిధిలమైపోయాయి. ప్రాజెక్టుల మట్టికట్టలు కొట్టుకుపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో వరద బీభత్సం చిన్నది కాదు. విశాఖలో హుదూద్ సృష్టించిన బీభత్సం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.
హుదూద్ కన్నా ఎక్కువగా సీమకు నష్టం చేసిన వరద !
విశాఖలో హుదూద్ సృష్టించిన బీభత్సం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ కావడంతో ప్రాణ నష్టం దాదాపుగా లేదు. నిజానికి అక్కడ జరిగిన విధ్వంసం చూసిన తర్వాత కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అప్పట్లో అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడంతో తిరిగి తీసుకు రాలేని ప్రాణాలు కాపడగలిగారు. ఆస్తి నష్టం మాత్రం వేల కోట్లలో జరిగింది. ప్రస్తుతం రాయలసీమలో జరిగిన బీభత్సం చూస్తూ హుదూద్ కన్నా ఎక్కువ నష్టం కలిగింప చేసింది. ఎక్కడ దృశ్యాలు చూసినా ఒళ్లు జలదరించిపోతోంది. అలా ఉప్పెనలా వచ్చి పడిన వరదలో ఇళ్లు, వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయంటే ఈ విపత్తు మాములుగా చెప్పుకునేది కాదు. కొన్ని వందల, వేల కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి.
ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం !
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం వస్తుంది .. పోతుంది అనుకునే వైఖరి వల్ల వర్షాల విషయంలో ఎవర్నీ అప్రమత్తం చేయలేకపోయారు. ఫలితంగా ప్రాణనష్టం అనూహ్యంగా ఉంది. మూడు బస్సులు వరదలో చిక్కుకుంటే సకాలంలో స్పందించని నిర్లక్ష్యానికి ఇరవై ప్రాణాలు వరకూ బలైపోయాయి. ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇక ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయి గ్రామాలను నీరు ముంచెత్తిన ఘటనలో కొట్టుకుపోయిన వారు ఎందరో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఎలా చూసినా ప్రాణ నష్టం అనూహ్యంగా ఉంది. ఇది నివారించలేనంత ఆకస్మాత్గా వచ్చి పడిందేమీ కాదు. అందరికీ స్పష్టత ఉంది. భక్తుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించిన టీటీడీ రెండు రోజుల ముందుగానే దర్శనాలను … ఘాట్ రోడ్డు, నడక దారుల్లో రాకపోకల్ని ఆపేసింది. దీని వల్ల ఎంత మేలు జరిగిందో.. అక్కడ వెలుగులోకి వస్తున్న విధ్వంస ఫోటోలే నిరూపిస్తున్నాయి.ఇదే జాగ్రత్తలు ఇతర చోట్ల యంత్రాంగం ఎందుకు తీసుకోలేకపోయిందనేదే ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.
ప్రజల్ని చేతలతో ఆదుకుంటారా.. ప్రకటనలతోనే సరి పెడతరా ?
వరదల దాటికి వందల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. రైతులు పంట కోల్పోయారు. ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. రూ. ఐదు లక్షలు చనిపోయిన వారి కుటుంబానికి ప్రకటించడం కాదు…తక్షణం అందచేయాలి. గత ప్రభుత్వం హుదూద్తో పాటు తీత్లీ విరుచుకుపడినప్పుడు అప్పటి ప్రభుత్వం అప్పటికప్పుడు నష్టపరిహారం ప్రకటించి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అలా చేస్తేనే బాధితులకు కాస్త రిలీఫ్ ఉంటుంది. లేకపోతే వారి ఖర్మానికి వారిని వదిలేసినట్లే అవుతుంది. అయితే తీత్లీ పరిహారాన్ని భారీగా పెంచుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇంత వరకూ పంపిణీ చేయలేదు. ఇప్పుడు రాయలసీమ రైతులకు పరిహారం ఇస్తుందో లేదో .. ఎప్పటిలాగే.. తాము రైతులకు ఇన్నివేల కోట్ల నగదు బదిలీ చేశామని లెక్కలు చెప్పిసర్దుకోమని అంటుందో వేచి చూడాలి.