తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న వరి రాజకీయం పోరాటంలోకి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెల్లగా కాంగ్రెస్ పార్టీని తీసుకు వస్తున్నారు. ఆ రెండు పార్టీలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక్క సారిగా “కల్లాల్లోకి కాంగ్రెస్” అంటూ రేవంత్ స్పీడ్ పెంచారు. రెండు పార్టీలు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని.. వారిని బలిపశువులను చేస్తున్నాయని ఆరోపిస్తూ రంగంలోకి దిగిపోయారు. ఇప్పటి వరకూ వరి పోరాటంలో కాంగ్రెస్ వెనుకబడిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా రేవంత్ వ్యూహం మార్చారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్ని తప్పు పడుతూ.. ఎక్కువగా టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. మద్యం దుకాణాలకు కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొత్త దుకాణాలకు టెండర్లు పిలవడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ. పధ్నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమైనా.. రాష్ట్రమైనా ధాన్యాన్ని కొనే వరకూ పోరాడతామని ఆయన ప్రకటించారు. రైతులకు భరోసా కల్పించేందుకు పొలాల్లోకే వెళ్తున్ారు.
తెలంగాణ ప్రభుత్వం గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికింది. ఆ తర్వాత ధాన్యం సేకరణ కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఈటల రాజేందర్ వంటి వారు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పలేదని మాట మార్చింది.అయితే ధాన్యం సేకరణ అరకొరగా చేస్తోంది.ఈ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు మీ వల్ల అంటే మీ వల్లేనంటూ టీఆర్ఎస్ , బీజేపీ రాజకీయం చేసుకుంటున్నాయి.