అధికార పక్ష నేతలు హద్దులు దాటితే మాలో ఇంకో అవతారం చూడాల్సింది వస్తుంది. అధికారంతో మీరు అడ్డుపెట్టుకున్న గోడలని సైతం బద్దలు కొట్టి మీ భరతం పడతాం ఖబడ్దార్” అని హెచ్చరించారు ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. నిన్న అసెంబ్లీ జరిగిన పరిమాణాలు, అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న పరిణామాలపై కుటుంబ సభ్యులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు బాలకృష్ణ.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ”అసెంబ్లీలో విమర్శలు సహజం. కానీ రాజకీయాలతో సంబంధం లేని నా సోదరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అధికార పక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు సహించరానివి. అధికార పార్టీ నేతల తీరు చూస్తుంటే గొడ్ల చావిట్లో వున్నామా అనే అనుమానం కలుగుతుంది. ఇక సహించేది లేదు. ప్రజల తరుపున పార్టీ తరపున నా అభిమానుల తరపున ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇలాంటి నీచపు మాటలు ఆడితే సహించేది లేదు. మీ భరతం పడతాం. ఆడవాళ్ళ జోలికి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోం. ఇకపై ఎవరు నోరు తెరిచిన సహించం. అధికారంతో మీదు అడ్డుపెట్టుకున్న గోడలు బద్దలు కొట్టి మీ భరతం పడతాం. ఖబడ్దార్” అని హెచ్చరించారు బాలకృష్ణ.