ఈ సంక్రాంతి పోటీ మమూలుగా లేదు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్. మరోవైపు భీమ్లా నాయక్. వాటితో పాటుగా.. రాధే శ్యామ్ రిలీజ్ కి రెడీ అంటున్నాయి. ఈ మూడింటిలో ఒక సినిమా వెనక్కి వెళితే, మిగిలిన రెండు సినిమాలకు వెసులు బాటు లభిస్తుంది. ఆ ఒక్క సినిమా ఏమిటన్నదే హాట్ టాపిక్. అయితే ఈ మధ్యలో ‘బంగార్రాజు’ కూడా రిలీజ్ కి రెడీ అంటున్నాడు. నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం `బంగార్రాజు`. ఈసినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట. కానీ… చిన్న కండీషన్ కూడా ఉంది. నిర్మాత సుప్రియ `బంగార్రాజు` రిలీజ్ డేట్ గురించిన అప్ డేట్ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చేసింది. బంగార్రాజుని సంక్రాంతి కోసమే సిద్ధం చేస్తున్నామని, అన్నీ కుదిరితే సంక్రాంతికి రావడం పక్కా అని సుప్రియ తేల్చేసింది.కానీ చిన్న కండీషన్ ఉంది. సంక్రాంతికి ఆల్రెడీ రిలీజ్ డేట్లు ప్రకటించేసిన ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ ల నుంచి ఒక సినిమా డ్రాప్ అయితే.. చాలట. డ్రాప్ అయిన సినిమా ప్లేస్ లో బంగార్రాజుని దింపాలన్నది ప్లాన్.
”ప్రస్తుతానికి మూడు సినిమాలు సంక్రాంతికి వస్తామని ప్రకటించాయి. ఆ మూడూ వస్తే.. బంగార్రాజు రాకపోవొచ్చు. ఒక సినిమా డ్రాప్ అయినా మేం వచ్చేస్తాం. నాలుగు సినిమాలకు సంక్రాంతి బరిలో చోటు లేదు. రెండు సినిమాలకైతే హ్యాపీగా ఉంటుంది. రెండు సినిమాలు వస్తే.. మాకు కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. అందుకే సంక్రాంతికి ఏయే సినిమాలు వస్తున్నాయి? అనేదాన్ని బట్టి మేం రావాలా? వద్దా? అనేది ఫిక్సవుతాం. ప్రస్తుతానికి మా టార్గెట్ సంక్రాంతే” అని చెప్పుకొచ్చారు సుప్రియ. అంటే.. ఈ సంక్రాంతికి.. మూడు సినిమాలు రావడం పక్కా అన్నమాట. రాధే శ్యామ్, భీమ్లా, ఆర్.ఆర్.ఆర్లో ఏది డ్రాప్ అయినా.. బంగార్రాజు రెడీ అయిపోతాడు. అదీ.. మేటరు.