ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జగన్ టీం.. చంద్రబాబుకు చేసిన అవమానాన్ని ఖండిస్తున్నానని..మీ ప్రవర్తన సరి కాదని.. సమాజానికి తప్పుడు సంకేతం పంపారని విమర్శించారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా తాను ఈ మాట మాట్లాడటం లేదని.. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా స్పందిస్తున్నానన్నారు. వారు అన్న మాట జగన్నో.. నానినో అని ఉంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలన్నారు. స్పీకర్ కూడా అలా వ్యక్తిగత దూషణలు చేస్తూంటే ఆపలేదని.. స్పీకర్గా తమ్మినేని అన్ ఫిట్ అని తేల్చారు. కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలన్నారు.
చంద్రబాబు కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు తిట్టేటప్పుడు జగన్ నవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే నీ పరిస్థితి ఏంటి జగన్ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తనను గుర్తు పడతారో లేదో తెలియదని..అంత పరిచయం కూడా లేదన్నారు. కానీ ఓ సీనియర్ నాయకుడిని ఇలా అవమానించడం సరికాదన్నారు. ఇవాళ జగన్ తోపు కావొచ్చు కానీ.. ఇలాగే పాలన కొనసాగిస్తే రివర్స్ అవుతుందని జోస్యం చెప్పారు.
ఏపీలో ప్రజాస్వామ్యం లేని పాలన అనిపిస్తుందిన్నారు. అసెంబ్లీ హల్ లాగా లేదు.. గొర్రెను కభేలా లకు పంపినట్టు ఉందని విమర్శించారు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డితో తీవ్రంగా విభేదించే జగ్గారెడ్డి.. చంద్రబాబు విషయంలో స్పందించకూడదు. ఎందుకంటే చంద్రబాబుతో ఎక్కువ మంది రేవంత్ తో లింక్ పెడతారు. కానీ అనూహ్యంగా జగ్గారెడ్డి మాట్లాడటం ఆసక్తి రేపుతోంది.