తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు, మూడు రోజులు ఉండయినా ధాన్యం కొనుగోలుపై తేల్చుకునే వస్తామని స్పష్టం చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమనే ప్రకటన వచ్చిందని అది ఉత్తుత్తిదా లేకపోతే నిజమేనా అనేది ఢిల్లీలో తేల్చుకుంటామన్నారు . ఉన్నతాధికారులు.. కేంద్రమంమత్రులతోపాటు అవసరం అయితే ప్రధానిని కూడా కలుస్తామని తెలిపారు. ఎంత ధాన్యం కొంటారో చెప్పమంటే చెప్పడం లేదని అందుకే ఢిల్లీకి వెళ్తున్నామని స్పష్టం చేశారు.
సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల విజయం అన్న కేసీఆర్… బీజేపీ చేసిన దానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్యమంలో చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. పాతిక లక్షల నష్టపరిహారం చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మరణించిన ఒక్కో రైతు కుటుంబానికిరూ. మూడు లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఇందు కోసం రూ. ఇరవై రెండున్నర కోట్లవుతుందని కేసీఆర్ చెప్పారు. అలాగే రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారని.. వాటన్నింటినీ బేషరతుగా ఎత్తేయాలన్నారు.
ఢిల్లీ పర్యటన జల వివాదాల పరిష్కారంపై.. ట్రిబ్యూనల్ ఏర్పాటుపైనా కేంద్ర జలశక్తి మంతిని కలుస్తామని స్పష్టం చేసారు. కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదు. తెలంగాణ నీటి వాటా ఎంతో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాటాలను తేల్చేందుకు వెంటనే ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలి. కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నాం. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.