సాక్షి దినపత్రికు నెలాఖరుకు వచ్చేసరికి జీతాలు ఇతర ఖర్చుల కోసం డబ్బులు చెల్లించడానికి లోటు ఏర్పడితే వెంటనే ప్రభుత్వ పరంగా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు నెల్లూరు, రాయలసీమ జిల్లాలు వరదలతో అతలాకుతలం అయిపోతూంటే ప్రభుత్వం ఇసుక గురించి ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. ఎందుకు జారీ చేశారంటే… ఎక్కడైనా కాంట్రాక్టర్లు సిండికేట్ అయి ధర పెంచేస్తే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ నెంబర్లు ఇవ్వడానికట. ఏపీ వ్యాప్తంగా జేపీ పవర్ అనే సంస్థకు ఇసుక కట్టబెట్టి చాలా కాలం అయింది.
ఇప్పుడు ఈ ఇసుక గురించి ఎందుకు సీఎం జగన్ కు గుర్తుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ కారణం సాక్షిలో ఆర్థిక వ్యవహారాలు చూసే వారికే తెలిసి ఉండవచ్చు. ఒక్క మెయిన్ ఎడిషన్ ఫుల్ పేజీ మాత్రమే కాదు.. జిల్లాలో పేజీల్లో కూడా యాడ్స్ ఇచ్చారు. మెయిన్ పేజీల్లో యాడ్ చూసిన వారు.. జిల్లా పేజీల్లో యాడ్ చూస్తేనే రేట్ ఎంతో తెలుస్తుందట. ప్రభుత్వం ఐ అండ్ పీఆర్ నుంచి ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తే అన్ని మీడియాలు దాన్ని కవర్ చేస్తాయి. దాని కోసం రూ. కోట్లు తన మీడియా సంస్థలకు వెచ్చించి ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు.
కానీ ఇక్కడ అజెండా వేరు కాబట్టి ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఓ వైపు ఆర్థికంగా దుర్భర పరిస్థితి.. మరో వైపు వరదలతో అతలాకుతలమవుతున్న ఓ ప్రాంతం అయినా .. ప్రభుత్వ పెద్దలు తమ సొంత ఎజెండా ప్రకారమే వెళ్తున్నారని ఈ ప్రకటనలు నిరూపిస్తున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది.