రూ.20 కూడా చేయని మద్యంను రూ. 250కి అమ్ముతున్న ఏపీ ప్రభుత్వం .. సినిమా టిక్కెట్ రేట్లను పదేళ్ల కిందటి ధరలతో ఖరారు చేసింది. పైగా ప్రజల్ని దోచుకుంటున్నారని అందుకే తగ్గించామని చెబుతోంది. ఈ వాదనను విన్న టాలీవుడ్ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి. ఎం చేయాలో తెలియక అనేక విధాలుగా.. పరిపరి విధాలుగా చర్చలు జరిపారు. కానీ డీల్ సెట్ కాలేదు. అదొక్కటే కాదు అనేక సమస్యలు ఉన్నాయి. అందులో పార్కింగ్ ఫీజు కూడా ఒకటి. గతంలో ధియేటర్లలో పార్కింగ్ ఫీజు ఉండేది.ఇప్పుడు వసూలు చేయవద్దని ఆదేశాలు ఉన్నాయి.
దీన్ని కూడా తొలగించి పార్కింగ్ ఫీజుకు చాన్సివ్వాలని కోరుతున్నారు. ఈ వినతి రెండు తెలుగు రాష్ట్రాలకూ చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకుంది. మల్టిప్లెక్స్‌లు, మాల్స్ కాకుండా సింగిల్ ధియేటర్లలోపార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి చాన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. గతంలో ఇలాంటి జీవో లేదు. ఈ కారణంగా న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. సింగిల్ ధియేటర్లకు ఈ పార్కింగ్ ఫీజు కూడా ఓ ఆదాయ వనరు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమాల విషయంలో ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందో టాలీవుడ్ వారికీ తెలియడం లేదు . కొంత మందికి మాత్రం తెలుసు. కానీ వారు ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఫలితంగా సమస్య పరిష్కారం కావడం లేదు. పెద్ద సినిమాల విడుదల కష్టంగా మారింది.