బుల్లి తెరపై దాదాపుగా ఓ స్టార్ హోదా అనుభవిస్తూ వస్తున్నాడు యాంకర్ రవి. ఫిమేల్ యాంకర్లలో హేమ ఎంత పాపులరో.. మేల్ యాంకర్లలో రవి కూడా అంతే పాపులర్. ఆ పాపులారిటీతోనే వెండి తెరపై అడుగుపెట్టాడు. హీరోగా ఓసినిమా చేశాడు. ఇప్పుడు అదే పాపులారిటీ.. తనని బిగ్ బాస్ హోస్ వరకూ తీసుకెళ్లింది. ఈ బిగ్ బాస్ 5 సీజన్లో రవి స్ట్రాంగ్ క్యాండిడేటే. టైటిల్ విన్నర్లలో ఒకడిగా నిలిచే సత్తా… రవికి ఉందని ఈ షోని ఫాలో అవుతున్న వాళ్లంతా నమ్ముతున్న మాట. ప్రతీసారీ.. ఎలిమినేషన్లలో ఉండడం, ఓటింగ్ వల్ల.. గట్టెక్కడం రవికి అలవాటుగా మారాయి. రవి ఫాలోవర్లు… రవిని అభిమానించేవాళ్లు రవికి అండగా ఉంటున్నారు. అయితే..కొంతమంది రవిని అకారణంగా కార్నర్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ఎకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లకి ఎవరు వెళ్లినా, బయట ఓ పీఆర్ టీమ్ గట్టిగా పనిచేస్తుంటుంది. తమకు తాము హైప్ ఇచ్చుకోవడానికి ఓ ప్రత్యేకమైన సెటప్ ని బయటే ఎరేంజ్ చేసుకుని వెళ్తుంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. ఎక్కువ ఓట్లు పడడానికి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి, తమకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవడానికి సోషల్ మీడియాని గట్టిగా వాడుకోవడం పరిపాటే. ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ లో గెలిచినవాళ్లంతా సోషల్ మీడియా సపోర్ట్ తో, కిరీటం తెచ్చుకున్నవాళ్లే. అయితే.. తమకు హైప్ ఇచ్చుకోవడం వేరు, పనిగట్టుకుని వేరేవాళ్లని కించపరచడం వేరు. ఓ వర్గం.. రవిని టార్గెట్ చేసి, ట్రోల్ చేయడం మొదలెట్టింది. రవితో ఆగితే ఫర్వాలేదు. కుటుంబ సభ్యుల్నికూడా ఈ ట్రోల్స్ లోకి తీసుకొస్తున్నారు. దాంతో రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నా పేరు, పిల్లల పేరు కూడా ఈ ట్రోల్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇది గేమ్ స్పిరిట్ కాదు“ అంటూ నిత్య తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే… ఇది గేమ్ స్పిరిట్ కాదు. గెలవడానికి చాలా మార్గాలున్నాయి. మరొకర్ని.. నిందించడం వల్లో, కార్నర్ చేయడం వల్లో… తాము ఎలివేట్ అవుతామనుకోవడం పొరపాటు. దీన్ని.. బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా గమనించాలి.