కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం కైకాల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కైకాల ఇంట్లో కాలు జారి పడ్డారు. ఆ తరవాత.. ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తరవాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది. కరోనా తగ్గినా.. ఆ ప్రభావం కైకాలపై తీవ్రంగా పడింది. దాంతో ఆయనకు శ్వాస కోసమైన సమస్యలు తలెత్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో.. ఆయన్ని మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన శరీరంలోని కీలకమైన అవయవాలు పనిచేయడం మానేశాయని, చికిత్సకు సహకరించడం కష్టం అవుతుందని వైద్యులు తెలిపారు. శనివారం కైకాలకు కొన్ని కీలకమైన పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వాటి రిపోర్ట్ రావాల్సివుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం అత్యంత విషమ స్థితిలో ఉందని వైద్యులు నిర్దారించారు.