తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంలో రాజకీయాలు అంత సాఫీగా సాగుతున్నట్లుగా లేదు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేసి ఆయన రాజ్యసభ కాలంలో ముగిసిన మూడు ఏళ్ల సమయాన్ని కుమార్తె కవితకు ఇద్దామని కేసీఆర్ ఆలోచించినట్లుగా తెలుస్తోంది. అయితే కవిత ఈ విషయంలో సంతృప్తిగా లేరన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని ఆమె పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానం టిక్కెట్‌ను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు.
సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేసి బీఫాంలు ఇచ్చి ఢిల్లీకి వెళ్లారు. ఎల్.రమణకు కరీంనగర్ స్థానిక సంస్థల కోటాలో చాన్సిచ్చారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరో చాన్సిచ్చారు. పలువురు ఎమ్మెల్సీలకు రెండో విడత అవకాశాలు కల్పించారు. ఖమ్మం నుంచి పలువురు సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ ఒకరికి ఇస్తే మరొకరికి ఆగ్రహం వస్తుందన్న కారణంగా తాతా మధుకు అవకాశ ఇచ్చారు. నిజామాబాద్ అంశం మాత్రం పెండింగ్ పెట్టినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కవిత లేకపోతే ఆకుల లలితకు చాన్సిస్తారు.
అయితే కవితను ఢిల్లీ రాజకీయాలకు వెళ్లాలని కేసీఆర్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కవితను ఒప్పించిన తర్వాత ఆకుల లలితను అభ్యర్థిగా ప్రకటిస్తారు. అభ్యర్థులందరూ ఈ రోజే నామినేషన్లు దాఖలు చేస్తారు. కవిత రాష్ట్ర రాజకీయాల్లోనే ఉటానని పట్టుబడితే ఆమెకు సిట్టింగ్ సీటు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఆమె పదవి కాలం జనవరి వరకు ఉంది.